Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి కళాశాలలో మహిళా సమానత్వం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

మదర్ థెరిస్సా కు నివాళులర్పిస్తున్న దృశ్యం

పాలకొల్లు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళా సమానత్వ దినోత్సవం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు.
అధ్యాపకులు, విద్యార్థులు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వుమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ బి కె వి రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ, మహిళలకు సమాజంలో సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, రాజకీయాలు, క్రీడలు తదితర అన్ని రంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా ప్రపంచానికి ప్రేమ, కరుణల గూర్చి నిజమైన అర్థాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిస్సా అని కొనియాడారు. విద్యార్థులు కేవలం అక్షరజ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజంలో వెనుకబడిన వారికి తోడుగా నిలిచే సేవా నిరతిని, నైతిక విలువలను తమ జీవితాల్లో అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మదర్ థెరిస్సా వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు . కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత ప్రసంగిస్తూ, సమాజ సేవకు మదర్ థెరిస్సా చేసిన త్యాగాలు చిరస్మరణీయం అని, ఆమె సేవా తత్పరతను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. సమాజంలోని నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి తమ వంతు సహాయం అందిస్తామని విద్యార్థులందరిచే ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు ఆశాజ్యోతి ,స్వర్ణలత ,కంప్యూటర్ అధ్యాపకులు మాధురి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.