Skip to main content

Telugu News Power

అధినేత ఆశీస్సులతో ఘర్ వాపసి బాబులిద్దరికి వైసిపి లో పెద్ద పీట. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.

వైసిపీ సి ఈ సీ సభ్యులు

పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్.కామ్) పాలకొల్లు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉత్సాహం పెళ్ళుబుకింది. వైసిపి పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక, సీనియర్ నాయకులు మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు లకు పార్టీలో సముచిత స్థానం కల్పించినట్టు ఆదేశాలు గురువారం అందాయన్న సమాచారం ఇందుకు కారణం అయ్యింది. మేక శేషుబాబు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జిల్లాలోనే మొదటి వైసీపీ పార్టీకి ఖాతా తెరిచిన నాయకుడుగా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పార్టీలో మేక శేషుబాబుకు తగిన గుర్తింపు గౌరవం ఉన్నాయి. ఎమ్మెల్సీగా, ప్రతిష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తగా పదవులు లభించాయి. శేషుబాబు కు సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు రాజకీయం నడిపిన అపార అనుభవం ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా చాటారు. నియోజకవర్గ అభ్యర్థిగా గెలుపు సాధించకపోయినప్పటికీ, ఫలితాన్ని నిర్దేశించగల శక్తి సామర్ధ్యాలు శేషుబాబుకు ఉన్నట్టు పరిశీల అంచనా. శేషు బాబుని సరిగా ఉపయోగించకపోవడం వల్ల వైసీపీ పార్టీ నియోజకవర్గంలో ఓటమి పాలయిందన్న బాధ పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ, వ్యక్తిగత సంభాషణలో వ్యక్తం అవుతుంది. అయితే, వైసిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, అందుకు కారణాలను పత్రికా సమావేశంలో సుదీర్ఘంగా వివరించి, పార్టీ నుంచి శేషుబాబు బయటకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలా అని ప్రయత్నం చేసినట్టు, టిడిపిలో చేరుతున్నట్టు పుకార్లు షికారులు చేశాయి. అయితే ఇలాంటి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు చూపాలని శేషుబాబు సవాలు విసిరారు.
శేషుబాబు ఇ టీవల కొన్ని వ్యక్తిగత సమస్యలపై వార్తలకు ఎక్కారు. తను రాజకీయంగా ఎదుర్కోలేక, వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఇతరులతో ప్రతిష్టకు భంగం కలిగించేలా రాజకీయం చేస్తున్నారని శేషు బాబు ఆరోపించారు. శేషుబాబు రాజకీయంగా మరో పార్టీలో ఇమడలేక తన సొంత పార్టీ గూటికే చేరుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య ప్రియ శిష్యునిగా రాజకీయాల్లో ప్రవేశించిన గుణ్ణం నాగబాబు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైసిపి పార్టీకి తొలినాళ్లలోనే అధినేత జగన్ వెంట నడిచిన నాయకులలో నాగబాబు ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఒక సారి సీటు వచ్చిందనుకుంటే, కాంగ్రెస్ అధిష్టానం స్థానికేతురుడికి సీటు ఇచ్చి నాగబాబు అభ్యర్థిత్వం ఆశలపై నీళ్లు చల్లింది. నియోజకవర్గ అభ్యర్థిగా, డాక్టర్ బాబ్జి పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో తొలిసారి ఓటమి చవిచూశారు. ఆనాడు, పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో ఉన్న వీరవాసరం లో 25 లక్షల రూపాయలు ఖర్చుకు, నాగబాబు వెనుక పెద్దలు వెనకడుగు వేయడంతో, చేతి వరకు వచ్చిన విజయం చేజారిపోయిందని ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తారు. వైసీపీ టికెట్ కోసం విఫల ప్రయత్నం చేసి, ఆవేశంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మరోసారి తన ఖాతాలో ఓటమి జమ చేసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రత్యేక అభిమానంతో కొందరు వైసిపి నాయకులు, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచినట్లు చెబుతారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి, వైసిపి పార్టీ వరకు ఆయా పార్టీలను మోస్తూ, ఆర్థికంగా చాలా నష్టపోయినట్టు నాగబాబు పట్ల సోనుభూతి ఉంది. జనసేన పార్టీ నుంచి ఓటమిపాలైన అతి కొద్ది కాలానికే, ఆ పార్టీలో కొనసాగలేక, జగన్ వద్ద గట్టి గా హామీ పొంది, పార్టీలో ఎప్పటికీ ఖాళీగా తనకోసం ఎదురుచూసే పార్టీ స్థానాన్ని మళ్లీ భర్తీ చేశారు.
మేక శేషుబాబు, గుణ్ణం నాగబాబు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అయినప్పటికీ, రాజకీయంగా ఉన్న అభిప్రాయ భేదాల వల్ల వారు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా నష్టాలు చవి చూడవలసి వచ్చిందని పరస్పరం తెలుసుకొని, ఐక్యంగా పార్టీ కోసం పరిచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు, ఆ మేరకు అధిష్టానం హితబోధ చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పాలకొల్లు నియోజకవర్గానికి గతంలో లేని రికార్డును, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి రామానాయుడు తనదైన శైలిలో హ్యాట్రిక్ సాధించి ఎవరూ తిరిగిరాయలేని చరిత్ర సృష్టించారు. నియోజకవర్గానికి నాయకుడి గా
ప్రత్యామ్నాయంగా సూచించే ఒక్క పేరు కూడా లేకుండా, అప్రతిహతంగా అధికారాన్ని నిమ్మల కొనసాగిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి సందులో గొందులో అభివృద్ధికి సంబంధించి శిలాఫలకం తప్పక దర్శినం ఇస్తుంది. ఉపాధి శ్రామికుల దగ్గర నుంచి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల వరకు, ఇతర పార్టీల నాయకులను తనదైన శైలిలో ఆకట్టుకుని, వచ్చే ఎన్నికలకు కూడా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని, అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. స్థానిక నాయకులతో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు విజయవంతమైన సంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. ఇటీవల పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డంపింగ్ యార్డ్ మట్టిని నింపడాన్ని వైసిపి శ్రేణులు బలంగా అడ్డుకోగలిగాయి. డంపింగ్ యార్డ్ మట్టిని మళ్ళీ డంపింగ్ యార్డ్ కు తరలించవలసిన అనివార్య పరిస్థితిని తీసుకొచ్చాయి.
ఈ నేపథ్యం లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీకి దిగ్గజాల్లాoటి, శేషుబాబు, నాగబాబుకు పార్టీ అత్యున్నత నిర్ణయాక స్థాయిలో ఒకటైన వైసిపి పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో వారికి సభ్యులుగా పదవులు కేటాయించింది. దీంతో, ఇప్పటివరకు వైసీపీ పార్టీ, స్థానిక నాయకుల కీచులాటల వల్ల, స్థానికేతర నాయకుల డంపింగ్ పట్ల పునరా ఆలోచన చేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో నాగబాబును అభ్యర్థిని ఖరారు చేసేటట్టు పరిస్థితులు ఉంటాయని వారి అభిమానులు భావిస్తున్నారు. అయితే శేషుబాబు వర్గం, ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేనప్పటికీ, వారికి కూడా ప్రాధాన్యత కలిగిన పదవిని అధినాయకుడు జగన్ కట్ట పెడతారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల నుంచి నియోజకవర్గాన్ని తన భుజస్కందాలపై మోస్తున్న గుడాల శ్రీహరి గోపాలరావుకు కూడా నియోజకవర్గాల పునర్విభజనలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి గోపీ సేవలకు నజరానాగా ఇస్తారని సమాచారం.
ఏదైనా, దేశ రాజకీయ చరిత్రలో ఓకే పార్టీ తరపున, ఓకే అభ్యర్థి, ముమ్మారు గెలుపొందడం, ప్రత్యర్థి పార్టీ నిస్సహాయంగా మిగిలిపోవడం తో పాలకొల్లు నియోజకవర్గం ఒక కేస్ స్టడీగా నిలుస్తుందటంలో అంటే అతిశయోక్తి లేదు.