సీజేఐ, సూర్యకాంత్‌ను వ్యతిరేకిస్తున్న నల్సార్, న్యాయ విద్యార్థుల.
హైదరాబాద్:ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్) జాతీయ న్యాయ అధ్యయనాలు, పరిశోధనా విద్యాలయం (నల్సార్)లో విద్యార్థుల నిరసన ఉధృతమవుతోంది. స్నాతకోత్సవానికి (కాన్వొకేషన్) భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సాంప్రదాయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ఏర్పాట్లను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది పట్టభద్రులు కాబోతున్న విద్యార్థులు 450 మందికి పైగా తమ
వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపక బృందానికి సమర్పించిన ఒక వినతిపత్రంలో, ఈ ఆహ్వానంపై పునరాలోచన చేయాలని విద్యార్థులు కోరారు. ఢిల్లీలో గత నెల 20న జరిగిన “చలో సంసద్” ర్యాలీ సందర్భంగా, నిరసనకారులపై పోలీసుల చర్యలకు సంబంధించిన పిటిషన్లను సీజేఐ ఏవిధంగా వ్యవహరించారన్న అంశంపై తమ ఆందోళనలను వారు తమ వినతిపత్రంలో ప్రస్తావించారు. యువతపై ఆయన చేసిన వ్యాఖ్యలను, పోలీసు దురాగతాలకు సంబంధించిన వీడియోలను చూసేందుకు సమయం లేదని ఆయన అన్నట్టుగా వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, ఇవి విద్యార్థుల పట్ల ఉదాసీనతను ప్రతిబింబిస్తున్నాయని వారు వాదిస్తున్నారు.
ఈ వివాదానికి మూలం జూలై 22న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ కారణ మైంది. నిరసనకారులపై పోలీసు అతిక్రమణలపై జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ, సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్వయంప్రేరిత (సుమోటో) విచారణ చేపట్టేందుకు నిరాకరించిందని వారు పేర్కొన్నారు. ఆ సందర్భంగా వెలువడినట్టు చెబుతున్న “బొద్దింకలు” అనే వ్యాఖ్యలు, నీట్ పరీక్షల వివాదానికి సంబంధించి నిరసనలు చేపట్టిన “కాక్రోచ్ జనతా పార్టీ” ఏర్పాటుకు కారణమయ్యాయని చెబుతున్నారు.
సాధారణంగా నల్సార్ యూనివర్సిటీ ఏటా పదవిలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తినే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. అయితే ఈ ఏడాది కాన్వొకేషన్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, విద్యార్థుల వినతిపై విశ్వవిద్యాలయం ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఇదే వివాదానికి సంబంధించి, ముంబైలోని టాటా సామాజిక శాస్త్రాల సంస్థ (టిస్) కూడా తమ స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. నిరసనల భయంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం ఒక్క వేడుకకు సంబంధించిన అంశం కాదని, రాజ్యాంగపరమైన జవాబుదారీతనం, విద్యా స్వేచ్ఛ వంటి విలువలను గౌరవించాల్సిన ఒక ముఖ్యమైన సందర్భంలో, విద్యార్థుల ఆవేదనను పట్టించుకోని వ్యక్తి అధ్యక్షత వహించడం సముచితమేనా అనే ప్రశ్నను విద్యార్థులు లేవనెత్తుతున్నారు. ఈ సమస్యకు ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడవలసి ఉంది.