100 వారాలపాటు “నషా ముక్త్ భారత్ అభియాన్”
గోడ పత్రికను ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు.
భీమవరం : ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) స్థానిక బ్యాంక్ కాలనీలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం గోడ పత్రికను ఆవిష్కరించారు. దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు 100 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు . యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, టివివి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ మైలబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈనెల 2న ప్రధాని మోడీ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, 100 వారాలపాటు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కొండ్రు శ్రీనివాస్, కలిదిండి రామచంద్రరాజు, కొప్పర్తి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.