పాలకొల్లు: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన, ఏకో క్లబ్, ఎన్.ఎస్.ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పచ్చదనం పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ) పాలకొల్లు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్ చంద్రకృష్ణ రిటైర్డ్ మేనేజర్ డాకె సుధీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, కళాశాల ప్రాంగణంలో నాటడానికి అవసరమైన వివిధ రకాల మొక్కలను కళాశాల యాజమాన్యానికి అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి వృక్షాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని నిరంతరం సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన తమ కళాశాల ప్రాంగణాన్ని పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కళాశాలకు మొక్కలను ఉచితంగా అందజేసిన ఎస్బీఐ అధికారులకు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం అతిథులు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, కృష్ణ, జంతు శాస్త్ర విభాగాధిపతి డా యం రామకృష్ణ, తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి, వృక్షశాస్త్ర అధ్యాపకులు పి. శ్రీనివాసరావు, వి. శిరీష, అర్థశాస్త్ర అధ్యాపకురాలు డా వి డి విజయలక్ష్మి ఇతర బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఏఎస్ఎన్ కళాశాలలో ఘనంగా వనమహోత్సవం.
కళాశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న దృశ్యం