Skip to main content

Telugu News Power

ఏపీ – గ్రీన్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నాగబాబు.

నాగబాబును అభినందిస్తున్న చిరంజీవి దంపతులు

అమరావతి:ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) .”ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)” ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా, కేబినెట్ హోదాతో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.
నూతన నియామకంపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పరిరక్షణకు దీర్ఘకాలికంగా నిబద్ధత ఉన్న తనకు గౌరవంగా పేర్కొంటున్నానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,తనను విశ్వసించి ఏపీ ‑గ్రీన్ కార్యనిర్వాహక సమితి ఛైర్‌పర్సన్,(కేబినెట్‑హోదా)గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ పదవి మాతృభూమి ఋణం తీర్చుకునే అవకాశం గా భావిస్తున్నానన్నారు . ఈ పదవిని ప్రోటోకాల్ లేదా ప్రతీకాత్మక స్థానంగా కాక, ఆంధ్రప్రదేశ్‌ను హరిత, ఆరోగ్యవంతమైన, పర్యావరణ పరిరక్షణలో ముందంజ వేసే రాష్ట్రంగా మార్చేందుకు పెద్ద బాధ్యతగా గ్రహిస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపుతున్న దూరదృష్టితో పాటు, తన వంతు కృషితో ఏపీ ‑గ్రీన్ ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రం, పచ్చదనం, వాతావరణ ప్రతికూలతలకు తట్టుకునే తీర్మానకేంద్రంగా మార్చేందుకు పనిచేస్తానన్నారు. ఈ బాధ్యతను ప్రస్తుత, భవిష్యత్ తరాలతో పంచుకుంటానన్నారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకుంది. నాగబాబు తన సోదరులు మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి కొణిదల చిరంజీవిని కలుసుకొని,ఆశీస్సులు అందుకున్నారు.రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాకారం చేసే దిశగా నాగబాబు నాయకత్వంలో ఏపీ గ్రీన్ మరింత సమర్థవంతంగా, సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత పచ్చగా, పరిశుభ్రంగా, పర్యావరణహితంగా, సుస్థిర అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని కూటమి నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.