Skip to main content

Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం.

వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం చేస్తున్న మురళి, ప్రిన్సిపాల్

పాలకొల్లు: ఆగస్టు,20( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ
మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల,అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్నమాణిక్యం అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ ల్యాబ్ అధినేత, కొమ్ముల మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిజిటల్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించారు. విద్యార్థులు వ్యవస్థాపకత, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు, స్వయం ఉపాధి, దేశ ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామికవేత్తల పాత్ర వంటి అంశాలపై రూపొందించిన డిజిటల్ పోస్టర్లను ప్రదర్శించారు.ఈ సందర్భంగా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్నమాణిక్యం మాట్లాడుతూ, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నూతన ఆలోచనలు, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, పట్టుదలతో యువత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవస్థాపకుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ముఖ్యఅతిథి, మురళీకృష్ణ మాట్లాడుతూ, వ్యవస్థాపక అంటే కేవలం వ్యాపారం చేయడం మాత్రమే కాకుండా, ఒక సమస్యకు సృజనాత్మక పరిష్కారం చూపడం, అవకాశాలను గుర్తించడం, వాటిని ఆచరణలో పెట్టడం అని వివరించారు. విద్యార్థులు తమకు ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని, కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. వైఫల్యాలకు భయపడకుండా నిరంతరం ప్రయత్నిస్తే విజయాన్ని సాధించవచ్చని దిశా నిర్దేశం చేశారు. అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వ్యవస్థాపక ఆలోచనా విధానం, సృజనాత్మకత, స్వయం ఉపాధి పట్ల అవగాహనను పెంపొందించడంలో దోహదపడిందన్నారు. అనంతరం డిజిటల్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, అర్థశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ వి డి వి విజయలక్ష్మి,అధ్యాపకులు జే చలం ప్రసాద్, ఎమ్ శిరీష ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.