Skip to main content

Telugu News Power

ఓ చిన్న మాట వెనుక ఓ చిన్నారి పెద్ద మనసు

ఇండియా టుడే ఇంటర్వ్యూ లో కేంద్ర మంత్రి వీడియో కాల్ లో టింకు
దేశ ప్రజల మనసు కదిలించిన కరగ టింకిల్ గోంగో

మమ్మల్ని భారతీయులనే పిలవండి
(“హమ్‌కో ఇండియన్ బోలో”)
ఆ ఒక్క మాటతో దేశప్రజల జేజేలు

కిరణ్ రిజిజు వీడియో కాల్.. “ఇప్పుడు దేశమంతా నిన్ను ప్రేమిస్తోంది” అన్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్)
“మమ్మల్ని భారతీయులని అని పిలవండి.. చైనీస్ అని కాదు.”
నాలుగేళ్ల చిన్నారి చెప్పిన ఈ చిన్న మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సందేశంగా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారి టింకిల్ తన రూపురేఖల కారణంగా చైనీస్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
“అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది.. బాధగా ఉంటుంది. మేము భారతీయులం” అంటూ ఆ చిన్నారి అమాయకంగా, కానీ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలు ఎంతోమందిని కదిలించాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న రూపురేఖలను తరచూ గేలిచేసే వ్యాఖ్యలపై మరోసారి దేశవ్యాప్త చర్చకు దారితీశాయి.

టింకిల్‌తో మాట్లాడిన కిరణ్ రిజిజు.
టింకిల్ వీడియో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో భాగంగా జరిగిన ఈ సంభాషణలో రిజిజు చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
నెట్‌వర్క్ సమస్య కారణంగా టింకిల్ కొంత అయోమయంగా కనిపించినప్పటికీ.. రిజిజు ఎంతో ఓపికగా ఆమెతో మాట్లాడారు.
“నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు. ఇప్పుడు మొత్తం భారతదేశం నిన్ను ప్రేమిస్తోంది” అంటూ చిన్నారికి ధైర్యం చెప్పారు. గతంలో ఆమెను ఎవరు ఆటపట్టించారని కూడా అడిగారు.
చివర్లో.. “కిరణ్ అంకుల్ ఫోన్ చేశారని మీ అమ్మకు చెప్పు” అంటూ ఆప్యాయంగా చెప్పడం ఈ సంభాషణలో ప్రత్యేకంగా నిలిచింది.
“ఢిల్లీకి రా.. కలిసి భోజనం చేద్దాం”
ఇంతటితో ఆగని రిజిజు.. టింకిల్‌ను ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి వస్తే తనను కలవాలని, ఇద్దరూ కలిసి భోజనం చేద్దామని చెప్పారు. అందుకు చిన్నారి కూడా సంతోషంగా అంగీకరించినట్లు సమాచారం.
వీడియో కాల్ ముగించే సమయంలో టింకిల్ చేతులతో హార్ట్ ఆకారం చూపిస్తూ బై చెప్పడం రిజిజు ముఖంలో చిరునవ్వు తెప్పించింది. ఈ చిన్న క్షణం కూడా సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.
ఒక చిన్నారి మాట.. ఒక పెద్ద సందేశం
టింకిల్ కథలో అసలైన మానవీయ కోణం ఇదే. తనను ఎలా పిలవాలనే విషయంపై ఒక నాలుగేళ్ల చిన్నారి తన బాధను అమాయకంగా వ్యక్తం చేసింది. కానీ ఆ మాటలు కేవలం ఒక చిన్నారి భావోద్వేగాలుగా మిగలలేదు. దేశంలోని ఈశాన్య ప్రాంత ప్రజలు తమ రూపురేఖల కారణంగా ఎదుర్కొనే అనుభవాలకు ప్రతీకగా, ప్రతిధ్వనిగా మారాయి.
భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మనిషి భారతీయుడా కాదా అన్నది అతని ముఖాకృతి, చర్మం, భాష లేదా ప్రాంతాన్ని బట్టి నిర్ణయించలేం. భారతీయతకు రూపం ఉండదు..హృదయం ఉంటుంది.
“హమ్‌కో ఇండియన్ బోలో” అంటూ టింకిల్ చెప్పిన నాలుగు పదాలు ఇప్పుడు అదే విషయాన్ని దేశానికి మరోసారి గుర్తుచేస్తున్నాయి.
చిన్నారి టింకిల్‌కు దేశం నుంచి ఒకే మాట..
“నువ్వు ఇండియన్‌వే.. మనందరిలో ఒకరివే!”
“వసుదైక కుటుంబకం” భారతీయ తత్వం. ప్రపంచాన్నే ఓ కుటుంబంగా భావించే భారతీయులం వారసత్వం, భిన్నత్వమే లోనే ఏకత్వం ఇదే 4ఏళ్ళ చిన్నారి మనసులో మాట, హృదయ స్పందన కూడా. బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది కదా!