భీమవరం: జూలై, 14
( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిఏ లను, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులతో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారం తో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారని, అయితే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారన్నారని ఫ్యాక్టో నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను పరిష్కరించక పోవటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 12వ పిఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు అవుతున్నా, పిఆర్సీని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిరసన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తక్షణం 12వ పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసి, పిఆర్సీ అమలయ్యే వరకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 29 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను కూటమి ప్రభుత్వం కొంతమేరకు చెల్లించినప్పటికీ, ఇంకా 25 వేల కోట్ల రూపాయల పైబడి బకాయిలు పేరుకపోయాయన్నారు. వీటి చెల్లింపులలో నిర్దిష్టమైన కాల వ్యవధి లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో బకాయిల చెల్లింపులు జరగడం లేదన్నారు. నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నా, పాలకులు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు లేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపి, సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలనడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టం-2009 సెక్షన్ 23(1) కి సవరణకు కృషి చేయాలని కోరారు. చట్ట సవరణ జరిగే వరకూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ పరీక్షను, ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ, తక్షణం 12 వ పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, పిఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ మిత్రులు పాల్గొని నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తదితరులను బలవంతంగా పోలీసులు ముట్టడి ప్రాంతం నుంచి బలవంతంగా లాక్కువెళ్ళి, పోలీసు వ్యాన్ లో స్టేషన్ కు తరలించారు. తరువాత వారిని విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి విజయవంతం -ఫ్యాప్టో
నిరసన కార్యక్రమం అడ్డుకోవద్దని పోలీసులను కోరుతున్న ట్రాక్టర్ చైర్మన్ సాయి శ్రీనివాస్