Skip to main content

Telugu News Power

ఘనంగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవం.

వ్యవస్థాపక దినోత్సవం లో పాల్గొన్న కేంద్రమంత్రి వర్మ
విద్యార్థుల నుంచి నూతన వంగడాల వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేంద్రమంత్రి వర్మ

తాడేపల్లిగూడెం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ కె. ధనుంజయరావు అధ్యక్షత వహించారు. అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యాన పరిశోధన, విద్యా రంగాల్లో విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను గుర్తు చేశారు. రైతులకు ఆధునిక ఉద్యాన సాంకేతికతను చేరవేయడంలో, నాణ్యమైన పరిశోధనల ద్వారా ఉద్యాన రంగ అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ఉపకులపతి వివరించారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన పరిశోధనలు చేపట్టి రైతులకు ఉపయోగపడే సాంకేతికతను అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు మరియు ఉద్యోగులను సన్మానించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోగా, విశ్వవిద్యాలయం ప్రగతిని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.
విశ్వవిద్యాలయం అధికారులు, వివిధ కళాశాలల డీన్లు, విభాగాధిపతులు, పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొని 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.
వైయస్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం లో స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయంలోని విశిష్ట రక్షిత సాగు పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. నూతన పరిశోధనల గురించి శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గడచిన 19 ఏళ్లలో ఉద్యానవన విద్య, పరిశోధన మరియు రైతు సేవలలో ఈ విశ్వవిద్యాలయం అత్యున్నత కేంద్రంగా ఎదగడం గర్వకారణమని ప్రశంసించారు. ​ ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో ఉన్నత పదవులను అలంకరించడమే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగడం అభినందనీయమని కొనియాడారు. పట్టభద్రులవుతున్న యువ విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, భారతదేశ పోషకాహార భద్రత, గ్రామీణ సంపద సృష్టికి కీలకమైన ఆవిష్కరణలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.