Telugu News Power

ప్రఖ్యాత రచయిత్రి శారద ఆసుపవర్ధన్ ఇక లేరు.

రచయిత్రి శారద అశోక వర్ధన్

సికింద్రాబాద్: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రఖ్యాత రచయిత్రి, ప్రసిద్ధ కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శారదా అశోకవర్ధన్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
శారదా అశోకవర్ధన్ 28 జూలై 1938 న సికింద్రాబాద్‌లో జన్మించారు. తన 87ఏళ్ల ప్రస్థానంలో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ కలిపి 82 గ్రంథాలు వెలువరించారు. శారద అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్ గా జవహర్ బాల భవన్ సంచాలకులుగా ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం చేశారు సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్గా రీజినల్ సెన్సార్ బోర్డ్ చైర్ పర్సన్ గా కూడా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో ‘జాయింట్ డైరెక్టర్’గా పదవీ విరమణ చేసారు. శారదా అశోకవర్ధన్ కు నలుగురు కుమార్తెలు, నలుగురు అల్లుళ్ళు, నలుగురు మనవలూ, నలుగురు మనవరాళ్ళు ఉన్నారు. అంత్యక్రియలు శుక్రవారం జరుగాయి.
రాష్ట్రప్రభుత్వంచే 3 నంది అవార్డులు పొందిన ఏకైక రచయిత్రి తెలుగు విశ్వవిద్యాలయంచే 3 విశిష్ట పురస్కారాలు పొందిన ఏకైక రచయిత్రి సాహితీరంగంలో నిలువెత్తు తెలుగు సంతకం. సాహితీప్రతిభకు సజీవ సాక్ష్యంగా నిలచిన శారదా అశోకవర్ధన్
శారదా అశోకవర్థన్ ఆకాశవాణి, దూరదర్శన్ ప్రేక్షకులకు మరియు తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన ప్రముఖ రచయిత్రి. ఆమె ప్రధానంగా నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, మరియు పాటలు రాయడంలో మంచి గుర్తింపు పొందారు.తెలుగు పాఠకులకు,శ్రోతలకు తెలిసిన పేరే ఇది.
కవయిత్రిగా,కథా,నవలా రచయిత్రిగా,నాటక కర్తగా,
వ్యాఖాత్రి గా బాల సాహిత్యవేత్తగా పేరొందిన వారామె. ఇరవైమూడు నవలలు పన్నెండు కవితా గ్రంథాలు,
ఏడు కథా సంపుటులు, ఏడు నాటకాలు పన్నెండు బాల సాహిత్య గ్రంథాలు రాసిన శారదా అశోక వర్థన్
ఆంధ్రభూమి లో ‘ శారదాలోచనం’ ,’ మరమరాలు ‘
కాలమ్ లు ఆంధ్రప్రభ బాలల పత్రిక ‘ చిన్నారి ‘ కోసం
అయిదేళ్ళకు పైగా మంచిమాట శీర్షిక నిర్వహించారు.
ఆమె రాసిన నవలలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బాలసాహిత్యంలో కూడా ఆమె విశేషమైన కృషి చేశారు. ఆమె దూరదర్శన్ మరియు ఆకాశవాణిలో పనిచేశారు. ఇక్కడ ఆమె రాసిన నాటికలు, సంగీత రూపకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ, సాహితీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు.
పిల్లల కోసం కథలు, పాటలు రాయడం ద్వారా బాలసాహిత్య వికాసానికి ఆమె ప్రశంసనీయమైన కృషి చేశారు. కథానిలయం వంటి ప్రసిద్ధ తెలుగు కథా నిధిలో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి. జానపద కళారూపమైన బుర్రకథలు, పాటలు (లిరిక్స్) రాయడంలోనూ ఆమెకు మంచి ప్రవేశం ఉంది. తెలుగు సాహిత్య సభలు, ప్రముఖుల జయంతి వేడుకలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. తెలుగు సాహిత్యంలో అన్ని వర్గాల పాఠకులను ఆకట్టుకునేలా సరళమైన శైలిలో రాయడం ఆమె ప్రత్యేకత.
శారదా అశోకవర్ధన్
జవహర్ బాల భవన్ సంచాలకులుగా బాలల కోసం అనేక విశేష కార్యక్రమాలను నిర్వహించారు. వీరి ఉద్యోగకాలంలో వచ్చిన ‘బాల చంద్రిక’ చక్కని బాలల పత్రిక. పిల్లల మనసుకు హత్తుకునేలా రాసే శారదమ్మ పిల్లల కోసం రాసిన నూరు కథలను కేవలం ఒక కథల పుస్తకంగా కాక బాలల విజ్ఞాన సర్వస్వంలాగా మలిచారు. ఇందులో పిల్లలకు సంబంధించిన అనేక అంశాలు, లెక్కలేనన్ని విషయాలు పొందుపరిచారు. తెలుగు నెలలు, కాలాలు, సవంత్సరాలు, ఆకు కూరలు, కూరగాయలు ఒక్కటి రెండని కాదు అంశాన్ని పిల్లల కోణంలో ఆలోచించి, పరిశీలించి రాశారు.
ఇటీవల వచ్చిన మరో మంచి పుస్తకం ‘రుక్మిణీ కల్యాణం’. ఇందులో రుక్మిణీ కల్యాణం, మన పండుగలు గురించి బాగా రాసారు శారదమ్మ. ఇంకా తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, సికింద్రాబాద్ మహంకాళి జాతర, సంక్రాంతి, ఏరువాక పున్నమి, బుద్దపూర్ణిమ, మహావీర్ జయంతి, ఈద్ మిలాద్, ఇస్లామియా ఉత్సవాలు, క్రైస్తవ ఉత్సవాలు, గుడ్ ఫ్రైడే వంటి వాటి గురించి పిల్లల కోసం శారదా అశోకవర్ధన్ రాసారు
శారదా అశోకవర్థన్
” నా సిరిచుక్క సికింద్రాబాద్ ‘ అనే గ్రంథాన్ని సికిందరాబాద్
చరిత్రతో బాటు తన ఆత్మ కథనాత్మక విషయాలతో రంగరించి వెలువరించారు. ఆ పుస్తకానికి మీ సుధామ ను ఒక ముందుమాట రాయమని కోరగా ” శారదాధామం సికింద్రాబాద్ ” అని ప్రశసించారు. శారదా అశోకవర్ధన్ రచనల్లో ఎనిమిది కథా సంపుటాలు, 26 నవలలు, 3 వ్యాస సంపుటాలు, 10 కవితా సంపుటులు, 5 నృత్య నాటికలు, 7 నాటకాలు, 4 హాస్య గీతికలు, 2 బుఱ్ఱకథలు ఉన్నాయి. ఇవేకాక వివిధ పత్రికల్లో వీరు రాసిన కాలం రచనలు దాదాపు 1000 వరకు ఉండడం విశేషం. భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భక్త ధృవ మార్కండేయ’, ‘గోడ మీది బొమ్మ’ మొదలగు పలు సినిమాలకు పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళికృష్ణ గానం చేసిన వీరి ‘వినాయక సుప్రభాతం’ మిక్కిలి ప్రసిద్ధి చెందింది.
ఈమె ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్లో మూడు నంది ఆవార్డులు పొందిన ఏకైక రచయిత్రి.
నాలుగుసార్లు ఉత్తమ రచయిత్రి బహుమతులు,‘స్త్రీ’ టీవీ సీరియల్ కి నంది అవార్డు. ఈమె మరణం పట్ల సాహితీ లోకం నివ్వెరపోయింది. వారికి ఘన నివాళులు అర్పించారు.