
పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారం -2026 ప్రదానం
హైదరాబాద్: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు “మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారం -2026” ప్రదాన ఉత్సవం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి ప్రసంగిస్తూ తెలుగు భాష పరిరక్షణ ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. ఐదో తరగతి వరకూ మాతృ భాషలో విద్యా బోధన జరగాలనే చట్టం అమలు కావాలన్నారు. విద్యార్థి దశలో తాను మండలి వెంకట కృష్ణారావు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఆయన ఖ్యాతి తెలిసిందన్నారు. తండ్రి బాటలో మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాష పరిరక్షణ కోసం సంస్కృతి, కళలను కాపాడుకోవటం కోసం చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం అన్నారు. తండ్రి తరహాలో బుద్ధప్రసాద్ విదేశాల్లో తెలుగు సంఘాలను, రాష్ట్రేతర తెలుగు సంఘాలను ప్రోత్సహిస్తూ భాష వికాసానికి చేస్తున్న సేవ అభినందనీయం అన్నారు.
భాష మీద ప్రేమతో బుద్ధప్రసాద్ లాగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేవారు, కరువయ్యారన్నారు. ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా ఇరవై నిమిషాలు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలని పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వాలని సూచించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లక్ష్యం మంచిదే అయినా, ఆయా రాష్ట్రాల్లో ప్రధాన భాషలు మినహా మిగిలిన భాషలు అణచివేయబడ్డాయన్నారు. సూరత్ లో తెలుగు పాఠశాలలు, తమిళనాడులో కొన్ని తెలుగు స్కూల్స్ ప్రాధాన్యత కోల్పోయాయన్నారు.
ఎవరు ఎక్కడ నివసించినా తమ మాతృ భాషను మరువకుండా ఇంట్లో మాట్లాడుతూ పిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పాలని పిలుపునిచ్చారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరినీ కలిపి ఉంచాలనే లక్ష్యంతో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావును స్మరించుకోవటం, వారి తనయుడు మండలి బుద్ధప్రసాద్, తండ్రి బాటలో నడుస్తూ భాషకు చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం అన్నారు. మాతృ భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితం కావాలన్నారు. భాషలో ప్రతి పదాన్ని రికార్డు చేసి భావితరాలకు అందించి ప్రతి తెలుగు పదాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన సభలో గౌరవ అతిథి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రసంగించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, ఇంచార్జి డైరెక్టర్ ఆచార్య బిహెచ్ పద్మప్రియ గారు ఏర్పాట్లు పర్యవేక్షించారు.