
జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్. కామ్)
చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివాం, విక్రమార్కుడు శవాన్ని తన భుజంపై మోస్తూ వెళుతూ ఉంటే, బేతాళుడు చెప్పిన కథలో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పలేకపోతే విక్రమార్కుని తల
వెయ్యి ముక్కలవుతుంది. ఇది ఆనాటి జానపద కథ. నేటి విక్రమార్కుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, తన భుజాలపై అది శవమా, మానవ కంకాళమా అన్నట్టుగా ఉన్న ఓ మృత శరీరాన్ని గుడ్డలో చుట్టి,గుండెల్లో బాధను అదిమిపట్టి, జనారణ్యంలో సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చాడు. అతని పేరు జితు ముండా. తరతరాలుగా పేదరికానికి మారుపేరైన ఒడిశా రాష్ట్రం, కియోంజర్ జిల్లా, డియానాలి ఇతని స్వగ్రామం. ఇంత దూరం శవాన్ని తీసుకురావడానికి, ఇతనికి కూడా ఒక ప్రశ్నే కారణం. అయితే ఇక్కడ ప్రశ్న వేసింది బేతాళుడు కాదు, ఆ రూపంలో ఉన్న ఒడిస్సా గ్రామీణ బ్యాంకు వారు. శవానికి, బ్యాంకుకు మధ్య సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అవును, ఉంది. మళ్లీ ఒకసారి రెండు నెలల వెనక్కి వెళదాం. జీతు ముండా సోదరి కాక్రా ముండ ఒరిస్సా గ్రామీణ బ్యాంకు ఖాతలో రూ.19,300 లు డబ్బు దాచుకుంది. బహుశా అది ఆమె జీవితకాల సంపాదన కూడా కావచ్చు. ఆమె భర్త, బిడ్డ మరణించారు. రెండు నెలల క్రితమే ఆమె కూడా తమ వారిని వెతుక్కుంటూ, స్వర్గానికి వెళ్ళిపోయింది. మిగిలిన ఒకే ఒక్క రక్తసంబంధీకుడు జితు. సోదరికి చేయవలసిన కర్మకాండలన్నీ అతని జరిపించాడు. ఖర్చులకు డబ్బు అవసరమైంది. తన సోదరి పేరిట బ్యాంకులో ఉన్న సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లి, అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డాడు. కాళ్లు అరిగేలా బ్యాంకు చుట్టూ తిరిగాడు. బ్యాంకు వారు ఏమాత్రం కనికరించలేదు. చట్టం లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ మాల్యా, హర్షద్ మెహతా వంటి వాళ్లకు చుట్టం. జీతు లాంటి గిరిజనుడికి మాత్రం మెడకు చుట్టుకుంటుంది. ఎంత వేడుకున్నా, వినకపోవడంతో, గిరిజనులలో ఉండే సహజమైన, అమాయకమైన, తెగింపు అతనిలో కట్టలు తెంచుకుంది. తన చేతులతో పూడ్చిపెట్టిన తన సోదరి సమాధి వద్దకు చేరుకున్నాడు. సమాధి నుంచి సోదర శవాన్ని, అస్తిపంజరాన్ని తవ్వి బయటకు తీశాడు. ఏదో ఒక వస్త్రం లాంటి దాంట్లో చుట్టి, భుజాన వేసుకుని కిలోమీటర్ల కొద్ధీ నడుచుకుంటూ బ్యాంకు గేటు ముందు, ఆ మానవ కంకాళాన్ని పరుండ పెట్టాడు. ఎందుకు? మానవ పరిణామ క్రమంలో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడు. కానీ నేటికీ మూలాలు వదలకుండా ప్రకృతి తల్లి ఒడిలో జీవిస్తున్న వారు ఈ కొండ ప్రాంతాల వారు. నేటికీ వీరికి చదువు సంధ్యలు అందే పరిస్థితి అంతంత మాత్రమే. గత 50 ఏళ్ల నాటి మాట గురించి చెప్పుకునేదేముంది. బ్యాంకు వారు సంబంధిత పత్రాలన్నీ పూర్తి చేసి, తను మాత్రమే చట్టబద్ధమైన వారసుడునని సాక్షాలు సమర్పించాలని కోరారు. దీంతో, విసిగి వేసారిపోయిన జితు తన సోదరి పార్థివ శరీరాన్ని తీసుకొచ్చి, ప్రత్యక్ష సాక్ష్యంగా బ్యాంకు అధికారుల కళ్ళు తెరిపించాడు. మానవ చరిత్రలో, అత్యంత హేయమైన,ఘోరమైన, అమానవీయ వ్యవస్థ వికృత విశ్వరూపం, యావత్ ప్రపంచం చూడలేక కళ్ళు మూసుకుని, ముక్కున వేలేసుకుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే, ఇక్కడ వ్యవస్థలు ఎంతగా కుళ్లిపోయాయో ప్రపంచ మీడియా కోడై కూసింది. అమృతోత్సవం జరుపుకుంటున్న స్వతంత్ర భారతదేశంలో ఇది మొదటి సంఘటన కాదు. బిడ్డ మరణిస్తే ఆసుపత్రి అంబులెన్స్ ఇవ్వక భుజంపై మృతదేహాన్ని మోసుకెళ్లిన తండ్రి దైన్య దుస్థితి, భార్య చనిపోతే శవాన్ని సైకిల్ కు కట్టుకుని కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిన దయనీయ పరిస్థితి తెలిసిందే. మూలవాసుల రాజ్యాంగ హక్కులు గొప్పగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం నేటికీ శూన్యం. మానవత్వమా, ఎక్కడ నీ చిరునామా? అని సభ్య సమాజం ఘోషిస్తున్నది. పాలకుల పనితీరును ప్రశ్నిస్తున్నది.
మానవ కంకాళాన్ని సాక్ష్యంగా బ్యాంకు కు తెచ్చిన గిరిజనుడు. మానవత్వమా ఎక్కడ నీచిరునామా?
జితు తన సోదరి మృత కళేబరం భుజాన మోసుకు వెళుతున్న దృశ్యం.