న్యూఢిల్లీ: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత విదేశాంగ సేవ (ఐఎఫ్ఎస్) 2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలతో పరస్పర సమావేశమైన సందర్భంగా, ప్రధాని మోడీ, యువ దౌత్యవేత్తలతో మంగళవారం భేటీ అయ్యారు. సంప్రదాయ దౌత్య పరిధిని దాటి ప్రజలతో మరింతగా మమేకం కావాలని పిలుపునిచ్చారు.
స్థానిక సమాజాలు, విదేశాల్లోని భారతీయ ప్రవాసులతో అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకుని, భారత్–ఇతర దేశాల మధ్య ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
భారత ఆర్థిక ప్రయోజనాలకు దౌత్యవేత్తలు ఉత్ప్రేరకాలుగా మారాలని, విదేశీ పెట్టుబడులకు కొత్త అవకాశాలను గుర్తించి దేశ ఆర్థిక పురోగతికి దోహదపడాలని కోరారు.
భారత దౌత్య కార్యాలయాలను మరింత టెక్నాలజీ ఆధారితంగా, పౌర కేంద్రితంగా తీర్చిదిద్దాలని, డిజిటల్ ప్రెజెన్స్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన, స్పందించే కాన్సులర్ సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.
ప్రపంచానికి భారత్ గొప్ప నాగరికత, సంస్కృతి, సంప్రదాయాల నిలయమని చాటి చెప్పే బాధ్యతను యువ దౌత్యవేత్తలు చేపట్టాలని సూచించారు. భారత సాంస్కృతిక వారసత్వంతో పాటు దేశంలోని పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
భారత విదేశాంగ విధానానికి యువ దౌత్యవేత్తలు కొత్త శక్తిని అందిస్తూ, దేశ ప్రయోజనాలను ప్రపంచ వేదికపై సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
యువ దౌత్యవేత్తలు భారత్ ప్రయోజనాలకు వారధులుగా నిలవాలి. ప్రధాని మోడీ పిలుపు.
ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐ ఎఫ్ ఎస్) ట్రైనీలతో ప్రధాని మోడీ