
పాలకొల్లు: జులై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉత్పత్తి చేసిన దాని ధరను ఉత్పత్తి చేసిన వారే నిర్ణయిస్తారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి నిమ్మల ఆదివారం అధికారిక విధులకు సెలవు కావడంతో, తన రొయ్యల క్షేత్రం లో, మేత కలపడం దగ్గర నుంచి రొయ్యల పట్టుబడి వరకు వివిధ వివిధ కార్యకలాపాలలో శ్రామికులతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల సాగు చాలా సున్నితమైన పరిస్థితులకు ప్రభావితం అవుతుందన్నారు. రాత్రికి రాత్రే పంటకు నష్టం వాటిల్లై పరిస్థితుల్లో పంట చేతికిచ్చే వరకు రైతు కంటిమీద కునుకు ఉండదన్నట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితులు వైరస్ల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రైతుకు నష్టం కలిగించే ఉత్పాతాల నుంచి కాపాడుకోవడం కోసం అహర్నిశలు పనిచేయవలసి ఉంటుందన్నారు. సీడు,ఫీడు, ప్రోబయాటిక్స్ వంటి రొయ్యల సాగుకు అవసరమైన వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. రైతుల వద్ద సరుకు నిండుగా ఉన్నప్పుడు ధరలను ప్రాసెసింగ్ కంపెనీలు దారుణంగా తగ్గించి వేస్తున్నాయని విమర్శించారు. రైతుల దగ్గర సరుకు లేనప్పుడు ధరలు పెంచి రైతులను ఊరిస్తున్నారని ఆరోపించారు. రైతు పండించిన రొయ్యలకు రైతే ధర నిర్ణయించే రోజు రావాలని, ప్రాసెసింగ్ ప్లాంట్ లు కాదని మంత్రి పేర్కొన్నారు. ఉభయతారకంగా ఇరువురు లాభం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే సబ్సిడీపై విద్యుత్తు అందజేస్తున్నట్లు వెల్లడించారు.