యలమంచిలి, జూన్,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతే రాజుగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో ఈ ఏడాది తొలి విడత నిధులు శనివారం కొంతేరు గ్రామంలో యూత్ క్లబ్ వేదిక వద్ద జరిగిన రైతు సభలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని 14,458 మంది రైతులకు రూ.9.40 కోట్ల నిధులు నమూనా చెక్కు ద్వారా అందజేశారు. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరుగాలం శ్రమించిన రైతులు తమ పంట అమ్ముకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపేవారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతు తనకు ఇష్టమైన రైస్ మిల్లు వద్ద తన పంట అమ్ముకోవటానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పంట డబ్బు చేతికి రావడానికి ఏళ్ళుపూళ్ళు గడిచిపోయిన, అందక రైతు కుటుంబాలు అప్పుల పాలైన పరిస్థితిని చూశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో గంటల్లోనే రైతు ఖాతాలో ధాన్యం సొమ్ము జమ అవుతున్నందున రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రైతులను భయభ్రాంతులను చేసి వణికించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి చట్టాన్ని, కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయంతో రద్దు చేసిందని వెల్లడించారు. రైతుకు భద్రత కల్పిస్తూ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో తట్ట మట్టి కూడా తీయని పరిస్థితుల్లో ముంపుకు గురై రైతులు పంటలు కోల్పోయే వారిని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏటా సాగునీరు, మురుగునీరు కాలువలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పుట్ల కొలది పంట పండించడానికి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, రైతులకు చివరి ఎకరము వరకు నీరు అందించడానికి కూటమి ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తమ తొలి ప్రాధాన్యత రైతులకేనని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 980 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, వ్యవసాయ అధికారి పీ మురళీకృష్ణ, బాలా త్రిపుర సుందరి, ఉన్నమట్ల కపర్తి, మామిడి శెట్టి పెద్దిరాజు, సొసైటీ అధ్యక్షులు బత్తుల రాజు, బొప్పన హరి కిషోర్, ఆరమిల్లి చిన్ని,బోనం నాని, ఉన్నమట్ల ప్రేమ కుమార్ తులా రామలింగేశ్వర రావు,కడలి గోపి, శ్రీనివాస్, సోంబాబు, కృష్ణ, వల్లభు సూపర్ మాన్, పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతే రాజు, కూటమి ప్రభుత్వ తీరు. -మంత్రి నిమ్మల.
అన్నదాతలకు నిధులు విడుదల చేస్తున్న మంత్రి నిమ్మల