
యూఏఈ నుంచి 10 మిలియన్ డాలర్ల అత్యవసర సాయం
ఖాఠ్మాండు: ఆగస్టు, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) హిమాలయ పర్వత ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో నేపాల్ తీవ్ర విషాదంలో చిక్కుకుంది. నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తులో మృతుల సంఖ్య 469కు చేరగా.. ఇరుదేశాల పరిధిలో 1,468 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.భారీగా కొట్టుకుపోయిన రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
విదేశీ రెస్క్యూ టీమ్‌లకు నేపాల్ నో చెప్పింది.
విపత్తు నేపథ్యంలో భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలు తమ ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను నేపాల్‌కు పంపేందుకు ముందుకొచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.నేపాల్ భద్రతా బలగాలు, స్థానిక యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. విదేశీ బృందాలను అనుమతించకుండా తమ సొంత వ్యవస్థలతోనే ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించింది.
భారత్ ఎన్ డి ఆర్ ఎఫ్ సాయం కూడా నేపాల్ వద్దన్నది.ఇదే సమయంలో వరదల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. భారత విదేశాంగ శాఖ తాజా వివరాల ప్రకారం 320 మంది భారతీయులు, 100 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇంకా కుటుంబ సభ్యులు, అధికారులతో సంప్రదింపులకు అందుబాటులో లేరు. భారత ప్రభుత్వం వారిని గుర్తించడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. నాటి
2015 భూకంప అనుభవమే కారణమా?
నేపాల్ తాజా నిర్ణయానికి 2015 గోర్ఖా భూకంపం అనుభవం కూడా ఒక కారణంగా చర్చకు వస్తోంది. అప్పట్లో భారీ సంఖ్యలో విదేశీ సహాయక, రెస్క్యూ బృందాలు నేపాల్‌కు చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో సమన్వయం, నిర్వహణలో ఇబ్బందులు ఎదురైనట్లు అప్పటి అనుభవాలు సూచించాయి.
అయితే ప్రస్తుత నిర్ణయం వెనుక 2015 అనుభవమే అధికారిక కారణమని నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. తమ భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రస్తుతం పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నందున విదేశీ రెస్క్యూ బృందాలు అవసరం లేదన్నదే ప్రభుత్వ అధికారిక వైఖరి.
రెస్క్యూ టీమ్‌లకు నో.. ఆర్థిక సాయానికి ఓకే
విదేశీ రెస్క్యూ బృందాలను తిరస్కరించినప్పటికీ.. నేపాల్ మానవతా, ఆర్థిక సహాయాన్ని మాత్రం స్వీకరిస్తోంది. భారత్ ఇప్పటికే భారీ మొత్తంలో అత్యవసర సహాయక సామగ్రి పంపించింది. అమెరికా 5 లక్షల డాలర్ల సాయం ప్రకటించగా, బ్రిటన్, దక్షిణ కొరియా తదితర దేశాలు కూడా ఆర్థిక, మానవతా సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి.
నేపాల్‌కు యూఏఈ రూ.830 కోట్లకుపైగా సాయం అందించింది.
భారీ విపత్తు నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ ) 10 మిలియన్ అమెరికన్ డాలర్ల అత్యవసర మానవతా సాయాన్ని ప్రకటించింది. యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ ద్వారా ఈ నిధులను అందించనున్నట్లు యూఏఈ అధికారిక వార్తా సంస్థ వామ్ వెల్లడించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఈ సాయాన్ని ప్రకటించారు. వరదలు, కొండచరియలు, మౌలిక వసతుల విధ్వంసంతో ప్రభావితమైన ప్రజలకు అత్యవసర సహాయం అందించడమే దీని లక్ష్యం. స్థానిక అధికారులు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ సహాయక చర్యలను సమన్వయం చేయనుంది.
10 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.830 కోట్లకు పైగా (మారకపు విలువను బట్టి) ఉంటుంది.
ప్రాణాలను కాపాడుకోవడమే తొలి ప్రాధాన్యం
నేపాల్‌లో ప్రస్తుతం స్థానిక భద్రతా బలగాలు, సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన అవరోధ సరస్సు కారణంగా మరోసారి భారీ వరద ముప్పు ఉండొచ్చన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
విదేశీ రక్షక దళాలు వద్దన్న నేపాల్ మాట ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.