
యలమంచిలి/ పోడూరు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మంత్రైన, ఉపాధి శ్రామికులైన అంతా ఒకటే కుటుంబం గా భావించి ముందుకు వెళ్లాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ శ్రామికుల సత్కార కార్యక్రమం యలమంచిలి,పోడూరు మండలాల్లోని గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ లేదని, పోయేటప్పుడు కూడా పట్టుకుపోయేదేమీ ఉండదని తెలిపారు. ఉన్నంతలోనే పదిమందికి సంతోషం పంచిపెట్టడం మంచిదని వేదాంత ధోరణిలో మంత్రి మాట్లాడారు. మండుటెండలో ఏడాదంతా పనిచేసిన ఉపాధి శ్రామికుల శ్రమను గౌరవించి వారి కష్టాన్ని గుర్తించి వారిని ఆహ్లాదపరచడానికి ఈ సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వారిని ఉల్లాసపరచటానికి మ్యూజికల్ చైర్స్, ఆటపాటల్లో భాగస్వాములను చేశారు. విజేతలకు బ్యాగులు చీరలు పంపిణీ చేశారు. విందు ఏర్పాటు చేసి స్వయంగా మంత్రి వడ్డించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. యలమంచిలి మండలం నాయకులు కడలి గోపి, బోనం నాని, పీతల శ్రీనివాస్, కోడూరు మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పెనుమత్స రాంభద్ర రాజు, మండల టిడిపి అధ్యక్షులు రమేష్ రాజు, కార్యదర్శి శీలం శ్రీనివాస్ తదితర కోటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొనడం ఉపాధి శ్రామికులకు అపూర్వ అనుభూతి, ఆనందం కలిగించింది.
