
పాలకొల్లు:అక్టోబర్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో శనివారం ఘనంగా జరిగాయి. సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. మున్సిపల్ కమిషనర్, దొడ్డా కిరణ్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్, వి. సత్యనారాయణ వేముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ అనేది జీవితానికి బలమైన పునాదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అపారమైన అవకాశాలున్న సరికొత్త శాస్త్ర సాంకేతిక రంగాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా నిరంతరం సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను ఉపయోగించుకోవడం ద్వారానే విద్యార్థులు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, తద్వారా దేశ పురోభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ వి.
సత్యనారాయణ వేముల మాట్లాడుతూ,నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ మార్కులే కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆర్థిక క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, అలవర్చుకుని ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలను దక్కించుకోవాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్నమాణిక్యం నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. కళాశాలలో ఉన్న అత్యాధునిక వసతులను, ప్రయోగశాలలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని, విద్యాపరంగా, పరిశోధనా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవాలన్నారు. కేవలం ఉద్యోగాలు సాధించే స్థాయిలోనే ఆగిపోకుండా సరికొత్త ఆవిష్కరణలతో స్వయం ఉపాధిని సృష్టిస్తూ ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా సీపీడీసీ సభ్యులు అద్దేపల్లి మోహన్‌దాస్, కె. రామలింగేశ్వర రావు, ఎన్ రామకృష్ణ, డా ఆర్ రాజేంద్ర ప్రసాద్, నాగార్జున రాజు, జి యస్ యన్ మూర్తి లు పాల్గొని నూతన విద్యార్థులను అభినందించారు. సీనియర్, జూనియర్ల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని పెంచేలా సాగిన ఈ వేడుకల్లో విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కె శామ్యూల్, జువాలజీ విభాగాధిపతి డా యం రామకృష్ణ, అధ్యాపకులు పి సునీల్ కుమార్, రగుతు షణ్ముఖరావు , శేఖర్, జి షమీమ్, డా శ్రీరామ్ వి నరేంద్ర, డా వి. డి వి విజయలక్ష్మి, పితాని శ్రీనివాసరావు, జి డి శ్రీనివాసరావు, వంశీ సుబ్బరాయన్, సిహెచ్ రవికుమార్, పార్ధసారధి, డి మన్మధరావు, స్వర్ణలత, ఆశాజ్యోతి, హెప్సిబారాణి, ఎమ్. శిరీష, వి రమేష్,మాధురి, రోహిత్ కుమార్ మరియు అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.