అమరావతి: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్)వైద్య ఆరోగ్య సేవలు సమర్ధంగా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. వైద్య సిబ్బందికి శిక్షణ 28 జిల్లాల్లో ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. పేదలకు చేరువ కానున్న వైద్య సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు.
సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సత్య కుమార్ యాదవ్