
ఖాఠ్మాండు/భూటాన్:ఆగస్టు,27( తెలుగు న్యూస్ పవర్. కామ్)
హిమాలయ దేశం నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వల్ల 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 750 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్‌లో 157 మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించగా, చైనాలోని టిబెట్‌లో మరో ముగ్గురు మరణించినట్లు సమాచారం.
మంచు–రాళ్ల హిమపాతం కారణంగానేనా?
రాసువా జిల్లాలోని ల్హెండే ఖోలా నది ప్రాంతంలో భారీ ఐస్–రాక్ అవలాంచ్ (మంచు, రాళ్ల భారీ పతనం) సంభవించి, నదీ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటం.. ఆ తర్వాత ఒక్కసారిగా నీరు, మట్టి, రాళ్లు భారీగా దిగువ ప్రాంతాలకు దూసుకురావడం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ భూకంపం సంబంధించినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల కొండ చర్యలు నదీ ప్రవాహానికి అడ్డుపడ్డాయని, అందువల్ల క్షణాల్లో కళ్ళముందే అన్నీ కొట్టుకుపోయినట్టు చెబుతున్నారు.
భోటే కోషి, త్రిశూలీ నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో గ్రామాలు, ఇళ్లు, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. సుమారు 19 వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు నేపాల్ అధికారులు తెలిపారు.
పర్యాటకులు, విదేశీయులు గల్లంతు
వరదల్లో అనేక మంది విదేశీ పర్యాటకులు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు, భద్రతా సిబ్బంది ఆచూకీ లేకుండా పోయారు. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం వందలాది మంది ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
దీంతో భారతదేశం సహా పలు దేశాలు తమ పౌరుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. గల్లంతైన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సహాయక చర్యలు ముమ్మరం
నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ సిబ్బందిని రంగంలోకి దించింది. భారీ వరదలు, దెబ్బతిన్న రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు మరింత ఆటంకంగా మారుతోంది.
వరదల కారణంగా నేపాల్ విద్యుత్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. సుమారు 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి నష్టం వాటిల్లినట్లు నేపాల్ విద్యుత్ అధికారులు తెలిపారు.
భారత్ సహాయం
విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్ సహాయ చర్యలు ప్రారంభించింది. రక్షణ, సహాయక చర్యలకు అవసరమైన సామగ్రిని పంపిస్తూ పొరుగు దేశానికి అండగా నిలుస్తోంది.
హిమాలయ ప్రాంతాల్లో మంచు కరుగుదల, హిమనదుల మార్పులు, ఆకస్మిక హిమపాతాలు వంటి పరిణామాలు ఇటువంటి విపత్తుల ముప్పును పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా కు భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము, ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ను ఆదుకోవటానికి అన్ని రకాల సహాయం అందజేస్తామని ఫోన్లో షా కు భరోసా ఇచ్చారు.