నర్సాపురం: జూన్,28 తెలుగు న్యూస్ పవర్. కామ్) సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎంత చెప్పినా వినకుండా మహిళలు కాలక్షేపానికి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. కొంతమందికి అది వ్యసనంగా కూడా మారిపోతుంది. ఏదో బలహీన క్షణంలో తన గుట్టు అపరిచిత వ్యక్తులకు వెల్లడించడం పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఇలాంటి సంఘటన నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కీలకమైన సైబర్ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన కేసు వివరాల ప్రకారం, నరసాపురం, రుస్తుంబాద ప్రాంతంలో నివసిస్తున్న ఒక వివాహితను లక్ష్యంగా చేసుకుని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ పాఠక్ (24) అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో పరిచయం చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండానే వ్యక్తిగత ఫొటోలను సేకరించి, వాటిని మార్ఫింగ్ ద్వారా అసభ్యకరమైన నకిలీ వీడియోలుగా రూపొందించాడు. అనంతరం, సదరు వీడియోలను ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు. వారు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితురాలి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహితలో ఫుల్ సెక్షన్ ల కింద దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, నర్సాపురం డీఎస్పీ ఎం. సుధాకర రావు పర్యవేక్షణలో, నర్సాపురం పట్టణ సీఐ ఆకుల రఘు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించిన పోలీసులు, నిందితుడు నరసాపురం, రుస్తుంబాదలోని కునపరెడ్డి కన్వెన్షన్ సమీపంలో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు, వెంటనే అప్రమత్తమై దాడి నిర్వహించి దీపక్ కుమార్ పాఠక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితునిపై చట్టపరమైన చర్యలు చేపట్టి, రిమాండ్ నిమిత్తం నరసాపురం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ ఆకుల రఘు, ఎస్సై పి. ప్రేమరాజు,సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
సామాజిక మాధ్యమాలను వినియోగించే ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రత కోసం సోషల్ మీడియా ఖాతాలకు తప్పనిసరిగా ‘ప్రొఫైల్ లాక్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఆమోదించవద్దని ఈ సందర్భంగా పోలీసులు కోరుతున్నారు.
సరదాగా మొదలై, సోషల్ మీడియా ఊబిలో కూరుకు పోతున్న మహిళలు.
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారులు