సఖినేటిపల్లి:డిసెంబర్,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అంతర్వేది లో వేంచేసి ఉన్న, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఉత్సవ ఏర్పాట్ల గురించి గురువారం అధికారులు సమీక్షించారు. ఈ ఉత్సవాలు జనవరి,25 నుంచి మొదలై ఫిబ్రవరి,2తోముగియనున్నాయి.
ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపం అలంకరణ, రథాన్ని సన్నద్ధం చేయటం, శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు, చలువ పందిర్లు, విద్యుత్ సౌకర్యం, క్యూలైన్లు నిర్మించడం, పోలీసువారి బందోబస్తు, వాహనాల పార్కింగ్, బారికేడ్లు పెట్టడం, సీసీ కెమెరాలు బిగించడం, గజ ఈతగాళ్లనుసిద్ధం చేయడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై అధికారులు ప్రజాప్రతినిధులు తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పలు సూచనలు చేశారు. పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న , డొంకలు తొలగించాలని సూచించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, అమలాపురం ఆర్టీవో కొత్తా మాధవి, జిల్లా ఎస్పీ ,రాహుల్ మీన, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మరియు ఉత్సవ కమిటీ అధికారి రమేష్ బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ,వివిధ శాఖల జిల్లా ,డివిజన్ స్థాయి అధికారులు, ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఆలయ అనువంశిక చైర్మన్ మరియు వ్యవస్థాపకుల వంశస్థులు రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజ బహదూర్ , రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల నరసింహారావు, సర్పంచ్ కొండా జాన్ బాబు, ఎంపీపీ వీర. మల్లికార్జున రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సమీక్ష సమావేశ వివరాలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం కె టి ఎన్ వి ప్రసాద్ వెల్లడించారు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష