పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్)
దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి నదికి ధీటుగా మలమూత్రాదులు, సకల కల్మషాలతో,ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిత్యం నిండుకుండలా ఉంటుంది. అంతకుమించి ముక్కుపుటాలు పగిలిపోయే దుర్గంధం ఎల్లవేళలా వ్యాప్తి చేస్తుంది. ఈ కోడు పాలకొల్లుకు దుఃఖ దాయని కూడా. వర్షాకాలంలో సగం పట్టణం దమ్మయ్యపర్తి కోడు కోరల్లో చిక్కుకొని విలవిలాడుతుంది.
మురికి నీటితో అల్లకల్లోలం చేస్తుంది. మనుషులకు బ్రతికుండగానే నరకం చూపిస్తుంది. ముళ్ళు,చేపల కంటే, దోమ కాట్లు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఈ మురికి కాలువ ప్రవహించే ప్రాంతం మొత్తం దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు భూగర్భ జలాలు కలుషితమైపోయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కునే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి. ఈ మురుగు కాలువ నీరు తోటలకు తోడేటప్పుడు చూస్తే, మురికి కాలవలో ఉన్న డిటర్జెంట్ రసాయనాలతో తెల్లటి మురుగు నురగతో పర్వతాల వలె కనిపిస్తాయి. అంటే మురికి కాలవలో ప్రవహించే నీటిలో ఉన్న రసాయనాల గాడత ఏ మేరకు ఉందో గ్రహించవచ్చు.గతంలో పాలకొల్లు నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కర్ర సాంబమూర్తి ఈ మురికి కోడు తవ్వకం కొంతమేర చేశారు. తదుపరి అప్పటి ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఈ కోడుకు కాంక్రీట్ ఓపెన్ టబ్ మురికి డ్రైన్ పనులకు దాదాపు రెండు కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు చెబుతారు. గుత్తేదారు పనులు చేయకపోవడం వల్ల కొంతమేర మాత్రమే పనులు జరిగి అర్ధాంతరంగా పనులు వదిలి వేయడం జరిగిందని సమాచారం. ఆ తదుపరి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తో కోడు, డ్రైన్ గా పేరు మార్చుకొంది. పనులు ప్రారంభమై కొంతవరకు సాగాయి. వైసీపీ ప్రభుత్వంలో ఈ పనులు మూలన పడి మురికి పట్టి పోయాయి. మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లోకి రావడం, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు సంబంధిత శాఖ మాత్యులు కావడం తో దశతిరిగింది. ప్రస్తుతం ఈ డ్రైన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి.ఈ పనులకు 13.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఈ మురికి డ్రైన్ 805 మీటర్ల పొడవు వరకు కాంక్రీట్ టబ్ నిర్మాణం చేస్తారు. దీంతో పాలకొల్లు శివారు వరిధనం రోడ్లో గల ఆవ డ్రైన్ వరకు నిర్మాణం పూర్తవుతుంది. రాజమండ్రి కి చెందిన ఏ ఎన్ ఆర్ ఇన్ఫ్రా వారు గుత్తేదారులుగా పనులు చేపట్టి, చేస్తున్నారు. ఈ పనులకు 7 ప్రోక్లైన్లు, 5ఏజేఏసీఎస్ లు,17 ట్రాక్టర్లు, ఒక రోడ్ రోలర్, 4వాటర్ ట్యాంకర్లు,100 మంది వరకు పనివారి తో నిత్యం పనులు జరుగుతున్నాయి.దాదాపు 14 వార్డులకు ముప్పుగా ఉన్న ముంపు సమస్యను శాశ్వత పరిష్కారం చూపే ఈ ప్రాజెక్టు స్థానిక శాసనసభ్యుల మానస పుత్రికగా ఇంజనీర్లు అభివర్ణించారు. సంక్రాంతికి ఈ పనులు పూర్తి కావచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

