Telugu News Power

లడ్డు నాణ్యత పరీక్ష ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.

తిరుపతి: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమలలో లభించే మంచినీరు, ఆహార పదార్థాల పరీక్షల కోసం అత్యంత ఆధునికమైన ప్రయోగశాలను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను కాపాడుతూ శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందిచేందుకు టీటీడీ చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా,టీటీడీ మరో చారిత్రాత్మక ముందడుగు అడుగు వేసిందన్నారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫ్ ఎస్ ఏ ఐ సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక మంచినీరు , ఆహార పదార్థాల విశ్లేషణ,ల్యాబ్‌ను ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను సూక్ష్మ స్థాయిలో పరీక్షించవచ్చు. ఇందులోని ఈ-టంగ్, ఈ-నోస్ వంటి అత్యాధునిక సౌకర్యాల ద్వారా ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించడానికి ఈ ల్యాబ్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు, రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. భక్తులకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. కృత్రిమ మేధా ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జనసాంద్రత, దర్శనం కొసం వేచి ఉండే సమయం, వాహనాల రాకపోకలు, వసతి, వైద్య అత్యవసరాలు వంటివి అన్నీ ఒకే ప్లాట్‌ఫారం ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షించి మెరుగైన సేవలు అందించేందుకు సహాయపడుతుందన్నారు. ఏ ఐ ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
పవిత్రత, ఆధ్యాత్మికత, సౌకర్యం, ప్రశాంతత వంటి అంశాల్లో టెక్నాలజీ వాడకం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడేలా టీటీడీ చేస్తున్న కృషికి శ్రీవారి భక్తుడిగా ధన్యవాదాలు తెలియజేశారు.

ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, చైర్మన్ బి ఆర్ నాయుడు తదితరులు

ల్యాబ్ పనితీరు అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు