
సింహాచలం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రసిద్ధ సింహాచల, వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవ(నిజరూప దర్శనం) ఉత్సవాల ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జరిగిన దురదృష్టకర సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో మాదిరి తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా, భక్తుల భద్రత కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడించారు. , వివిధ టిక్కెట్లు తీసుకున్న భక్తులు వివిధ మార్గాలలో సాఫీగా దర్శనం చేసుకోవటానికి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి, శనివారం మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. టిక్కెట్లు ఆన్ లైన్ లో చేసుకోవటానికి 17 వరకు అవకాశం ఇస్తామన్నారు. ఇక్కడి నుంచి ఉత్సవ ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఈనెల 20న జరగబోయే స్వామివారి చందనోత్సవాలకు లక్షకు పైగా భక్తులు దర్శనం కోసం విచ్చేయవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులు సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. క్యూ లైన్ లో భక్తులకు కావలసిన మంచినీరు, పసివారికి పాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.