యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన, ప్రతిష్టాత్మకమైన కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటికోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నాటక పరిషత్తుల నిర్వహణ మోయలేని భారమై, అనివార్యంగా మూసి వేయవలసిన పరిస్థితుల్లో కూడా కొంతేరు నాటక పరిషత్ నిర్విఘ్నంగా కొనసాగటం తో కళా రంగంలో కొంతేరు తన కీర్తి పతాకను ఎగురవేసింది. ఇక్కడ కళాభిమానులు, కళాకారులకు పంచభక్ష పరమాన్నాలు వడ్డించకపోయిన, తమకున్న దానిలో ప్రేమాభిమానాలు పంచుతూ, అతిధి మర్యాదలు చేయటం, ఇక్కడ ఆతిథ్యం అందుకున్న వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎక్కడ ఖండించో కళాభిమానులు ఈ నాటక ఉత్సవాలకు ఉత్సాహంగా హాజరవుతారు. ఇక్కడ కళాభిమానులు ఈ నాటిక ఉత్సవాలకు హాజరవడమే కాకుండా, మహిళలు పిల్లలు పెళ్లిపేరంటానికి వెళ్ళినట్టు పాల్గొంటారు. ఎందరో లబ్దప్రతిష్ట్యులైన కళాకారులకు ఇక్కడిచ్చిన ప్రదర్శనలు వారి ఉన్నతికి తొలిమెట్టుగా నిలిచాయి. ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం, కళాకారులకు వరంగా భావిస్తారు. గతంలో కర్రా సాంబమూర్తి వంటి వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి పూనుకొన్నారు. ఈ పరిషత్తు దినదిన ప్రవర్థమానమై నేడు యువతరం చేతుల్లో ఉజ్వలంగా తన కళా యజ్ఞం కొనసాగిస్తున్నది. స్వర్ణోత్సవాలకు పరుగులు తీస్తున్నది. ఈ సందర్భంగా, యూత్ క్లబ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పరిషత్ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు నాటక పరిషత్ ప్రచార పత్రిక ఆవిష్కరించి, వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, పరిషత్ కార్యదర్శి గంటా కళ్యాణి నాయుడు, , జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి నవీన్ చంద్, ఉపాధ్యక్షులు బోనం రవిబాబు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, డాక్టర్ బాబ్జి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
