పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి సంబంధించి కనీస అవసరాలైన రక్షిత మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు సరఫరా చేయటానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మి అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి ఎన్ ఎస్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సంచులు, ధాన్యానికి వెంటనే సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు కృషితో గ్రామాల్లో 75 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.4.5 కోట్లతో ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస రావు వెల్లడించారు. లంకల కోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2003 నంది మహిళలకు హెచ్ పి వి ఉచిత టీకా వేసినట్టు ఆరోగ్యశాఖ విస్తరణాధికారి గుడాల హరిబాబు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక ఆందోళనకరంగా ఉందని ఎంఈఓ లు గుమ్మళ్ళ వీరాస్వామి, గంగాధర్ శర్మ సమావేశం దృష్టికి తెచ్చారు. వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ప్రగతి గురించి సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో శాగా సత్యనారాయణ, మూర్తి బాబు, కేవీఆర్ నాయుడు, ఉపాధ్యక్షులు పడవల సునీల్ కుమార్, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలి.