
ముంబై: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
భారతదేశపు తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు ఏడాది మరింత వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పలు కీలక ఇంజినీరింగ్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బికేసి) నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్న ఈ రైలు, ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గించనుంది.భారీ గిర్డర్ల ఏర్పాటు పూర్తి అయ్యాయి.
అహ్మదాబాద్‌లోని మణినగర్ ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత భారీ పోర్టల్ బీమ్‌లను విజయవంతంగా అమర్చినట్లు ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్ వెల్లడించింది. ఒక్కో గిర్డర్ బరువు సుమారు 1,360 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇవి భారతీయ రైల్వే యాక్టివ్ ట్రాక్‌లపై కేవలం 3.5 గంటల్లో ఏర్పాటు చేయడం ప్రత్యేక సంతరించుకుంది. ఈ ప్రక్రియలో 2200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల భారీ క్రాలర్ క్రేన్‌ను తొలిసారి వినియోగించారు. మొత్తం ఐదు భారీ బీమ్‌లను 22 రోజుల్లో పూర్తి చేయడం ప్రాజెక్ట్‌లో కీలక మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు.
సొరంగ నిర్మాణ పనుల్లో పురోగతి
ముంబై పరిధిలోని విక్రోలీ ప్రాంతంలో అండర్‌సీ టన్నెల్ నిర్మాణానికి ఉపయోగించే 350 టన్నుల భారీ కట్టర్ హెడ్‌ను విజయవంతంగా దిగువకు దింపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ ఆదివారం వెల్లడించారు. ఇది టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో కీలక భాగంగా పనిచేస్తుంది.
అలాగే పాల్ఘర్ ప్రాంతంలోని ఎం.టి-6 మౌంటైన్ టన్నెల్ పనుల్లో కూడా రెండో గొప్ప పురోగతి సాధించినట్లు ఇంజనీర్లు తెలిపారు.
‘మేడ్ ఇన్ ఇండియా’ బుల్లెట్ ట్రైన్
భారతదేశంలోనే తయారు చేస్తున్న తొలి హైస్పీడ్ రైలు ‘బి28’ ప్రోటోటైప్ 2027 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరులో బుల్లెట్ ట్రైన్ తయారీ ఫ్యాక్టరీని ఇటీవల ప్రారంభించారు. ఈ రైళ్లు భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక సాంకేతికతతో రూపొందుతున్నాయి.
గుజరాత్ సెక్షన్, ముందుగా
సూరత్-బిలిమోరా-వాపి ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, గుజరాత్‌లోని కొంత భాగాన్ని ముందుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి. కొన్ని స్టేషన్ల నిర్మాణం 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జపాన్ సహకారంతో భారీ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లకు పైగా ఉండగా, దాదాపు 81 శాతం నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జే ఐ సి రుణంగా అందిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పశ్చిమ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత భారీ కట్టర్ హెడ్ ను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ వాడలేదు. రాళ్లు రప్పలు లెక్కచేయకుండా తలుచుకుంటూ పోవడం దీని ప్రత్యేకత.బుల్లెట్ ట్రైన్ మార్గంలో 21 కిలోమీటర్ల సొరంగ మార్గం. ఇందులో ఏడు కిలోమీటర్లు సముద్రం కింద నుంచి రైలు మార్గం నిర్మిస్తారు. ఈ సొరంగం థానే జల సంధి గుండా వెళుతుంది.ఈ టన్నెల్ ఒకే గొట్టం మార్గంగా ఉంటుంది. ఇందులో 5 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారీ కట్టర్ యంత్రాన్ని విజయవంతంగా ప్రవేశ పెట్టడాన్ని ఆదివారం వీక్షించారు.
