పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తన రాజకీయ ఎదుగుదలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జన వనరుల శాఖామాత్యులు ఎంతగానో తోడ్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు ఎదుగుదలకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా, స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ అంగర వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీ కావటానికి నిమ్మల పూర్తి మద్దతు, అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందించారని తెలిపారు. ఇవేవీ తెలియకుండా వైసీపీ నాయకులు శేషుబాబు మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శిస్తూ, తన పట్ల మొసలి కన్నీరు కార్చడం తగదన్నారు. అంతా కలిసి ఉన్నామని, కలిసే ఉంటామని, తమ మధ్య ఏ విధమైన కలహాలు లేవని తెలిపారు. తమ మధ్య ఉన్నవి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రమేనని, ఏ కుటుంబంలోనైనా ఇలాంటివి సహజమేనని తెలిపారు. ఎదుటివారిని విమర్శించే ముందు, తల్లిని, చెల్లిని ఇంటి నుంచి తరిమేసిన వైసిపి పార్టీ నేత తన ఇంటిని ముందుగా చక్కదిద్దుకోవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, గతంలో రిలయన్స్ సంస్థ అధినేత అంబానీ పట్ల అనుమానం వ్యక్తం చేసి, తరువాత వారితో కుమ్మక్కవటం పట్ల అనుమానాలు ఉన్నాయని అంగర పేర్కొన్నారు. నియోజకవర్గస్థాయిలోనే కాకుండా, రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కలిసే ఉంటుందని, కూటమిలో చిచ్చుపెట్టే వైసీపీ కుటిల ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించవన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలో రెండు మూడు స్థానాల్లో నిలపటానికి ప్రయత్నం చేస్తున్న, మంత్రి నిమ్మల మరో 15 ఏళ్లు పదవిలో ఉంటారని జోష్యం చెప్పారు. ప్రతివారం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని, ఈ 20 నెలల కాలంలోనే 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇవన్నీ చూసి కూడా వైసిపి వారు కళ్ళు ఉండి కబోదుల్లా
మాట్లాడటం తగదన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పాముల రజనీ కుమార్, బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు పాల్గొన్నారు.
కలిసే ఉన్నాం, కలహాలు ల్లేవ్ -మాజీ ఎమ్మెల్సీ అంగర
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న అంగర