
పాలకొల్లు: జూన్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం మరోసారి రోడ్డెక్కారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బైక్ ర్యాలీలో రైతులు విశేషంగా పాల్గొన్నారు. రొయ్యల దుకాణాలు, మందుల షాపులు మంగళవారం మూసివేయాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఆ మేరకు షాపుల యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆక్వారైజ సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, షాపుల బంద్ విజయవంతం చేసినందుకు డీలర్లకు, రైతులు ఒకరోజు రొయ్యల పట్టుబడి నిలిపి వేసి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫీడ్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ధారించిన రేటుకు ముఖ్యమంత్రి వద్ద అంగీకరించి, రైతులు వద్ద నుంచి అదనంగా రెండు రూపాయలు వసూలు చేయడం పట్ల గాంధీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రొయ్యల సీడ్ నెంబర్ తగ్గించి వేయాలని రైతులకు సూచించారు. అధికంగా మందులు వాడటం కూడా నియంత్రించుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే రొయ్యల రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స సత్యనారాయణ రాజు, వేడిది జాన్ డేవిడ్ రాజు, మేక ఫణీంద్ర ప్రసాద్, గుంటూరు చంటి రాజు, వివి సోమరాజు, అంగర వరప్రసాద్, కలిదిండి గజపతిరాజు, నున్న బోయిన నాగరాజు, కిరణ్ వర్మ, గొట్టుముక్కల శ్రీనివాస రాజు, ఈశ్వర కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.
