నర్సాపురం: జూలై 11,( తెలుగు న్యూస్ పవర్. కామ్)
గోదావరి పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురునారాయణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పుష్కరాల ప్రధాన ఘాట్లు నరసాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. పుష్కరాల పనుల కోసం ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా రూ.34.50 కోట్లు, బీపీస్ /ఎల్ ఆర్ ఎస్, హెచ్ ఏ ఎం ద్వారా మరో రూ.15 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నరసాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి మొత్తం రూ.64.50 కోట్ల నిధులు అందనున్నాయి.
ఈ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపడతాయి. పట్టణంలోని మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎస్టీపీ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ పూర్తయిన వెంటనే మరో రూ.22 కోట్లు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టిడిపి ఇన్చార్జ్ పొత్తూరు రామరాజు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాల నిధులకు మంత్రి నారాయణ హామీ.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ