Telugu News Power

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

చర్చ కార్యక్రమంలో మంత్రి మనోహర్

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్)

‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం, వారికి అండగా ఉండాలనే తపనతో రూపొందిన కార్యక్రమమే ‘‘జనసేన చర్చా వేదిక’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలతోపాటు, పార్టీ కార్యకర్తల కష్టనష్టాలను విని. వాటికి పరిష్కారం చూపేలా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీ నాయకులే కారకర్తల వద్దకు వెళ్లి వారి సమస్యలు వినడం అనేది దేశ రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని, తొలి సమావేశం కైకలూరు వేదికగా నిర్వహించడం ఆనందంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ అన్నారు. పార్టీ క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని. పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య నిరంతర సమన్వయం ప్రధానం అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సమీక్షించి ఒకే తాటిపైకి అందరినీ తీసుకొచ్చే ఈ కార్యక్రమం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ముద్రగడ పద్మనాభం గవర్నర్ పదవి వచ్చేలా సిఫార్సు చేద్దామని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తను తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ⁠ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ తరపున కొందరు పెద్దలు సంప్రదించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందరం కలిసి ప్రయాణం చేస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చర్చించారు. ఈ చర్చల్లో భాగంగానే, రాబోయే కూటమి ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం కు గవర్నర్ పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారు. ఆయన లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరం.
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గ్రూపు మాత్రమే ఉంటుంది
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో విశ్వాసం కలిగించే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా జనసేన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయవచ్చు. జనసేన పార్టీలో ఎటువంటి గ్రూపు రాజకీయాలకు తావులేదు. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలే జనసేనా పార్టీకీ, ప్రతి సైనికుడికి మార్గదర్శకాలు. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విడిగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తే వాటిని ప్రారంభంలోనే జనసైనికులు తుంచివేయాలి. నాయకులు ఎవరైనా సరే అధినేత లైన్‌కు కట్టుబడే పనిచేయాలి. మేమైనా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగానే పాల్గొంటాము. జనసేన సభ్యత్వం 60 వేలు నుంచి 24 లక్షలు చేరింది.
కైకలూరు నియోజకవర్గంలో 12,400 మంది సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం జనసైనికులు, వీరమహిళలు అందించిన అండదండలే. జనసేన పార్టీ 12 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదల, అనేక త్యాగాలు ఉన్నాయి. ఇప్పటం సభలో ఇచ్చిన మాట ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కూటమిని ఏర్పాటు చేశారు. పార్టీకి బలం ఉన్న చోట కూడా ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని సీట్లను వదులుకున్నారు. స్వార్థ ప్రయోజనాల కంటే ప్రజలకు మేలు జరగడమే లక్ష్యంగా నిలబడ్డారు. ఎన్నో అవమానాలు, కష్టాలు, ఇబ్బందులను అధిగమిస్తూ పార్టీని ఈ స్థాయికి చేర్చారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలి. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే రాజకీయాల్లో అనుభవం, ఎదుగుదల వస్తాయి. ప్రజలు ఇచ్చిన అఖండ విజయాన్ని గౌరవిస్తూ, కార్యకర్తల్లో నాయకత్వంపై ఎలాంటి అపనమ్మకం కలగకుండా బాధ్యతగా నడుచుకోవాలి.
బలం ఉన్న ప్రతి చోటా పోటీ చేస్తాం,
స్థానిక ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ఎక్కడ పోటీ చేస్తుంది అని కొందరు అడుగుతున్నారు. వారందరికీ ఒకటే సమాధానం,పార్టీ నాయకత్వం బలంగా ఉన్న అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత గెలిచే ప్రాంతాలను గుర్తించి అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపుతాం. వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసింది
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి, ప్రభుత్వ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాటి ప్రభుత్వం వ్యవస్థలను స్వప్రయోజనాల కోసమే వాడుకుంటూ వాటిని నిర్వీర్యం చేసింది. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం అందాంచలని పవన్ కళ్యాణ్ కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించారు. ఆర్థిక సాయం తీసుకోకుండా బాధిత కుటుంబాలను పోలీసులతో బెదిరింపులకు దిగారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఆహ్వానించినప్పుడు, అందులో మూడు కుటుంబాలను రాకుండా పోలీసులు, నాటి అధికార యంత్రాంగం బెదిరించి అడ్డుకున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సిద్ధవటంలో భారీ బహిరంగ సభను నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా సొంత నిధులతో దాదాపు వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాం. నాటి పాలనలో రోడ్ల దుస్థితి ఎలా ఉండేదో, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. కొల్లేరు విషయంలో పవన్ కల్యాణ్‌ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారు. ఆయన ఎన్నడూ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు” అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ పిడుగు హరి ప్రసాద్, శాసన సభ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నాయకులు చెన్నమల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.