Skip to main content

Telugu News Power

ఉప్పాడకు గొప్ప వరం, తీర రక్షణ గోడ. ఐఐటీ-మద్రాస్‌తో ఎం ఓ యూ.

మరిటైం బోర్డు, ఐ ఐ టి మద్రాస్ మధ్య ఉపముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం.

రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు.

మంగళగిరి:ఆగస్టు,12
(తెలుగు న్యూస్ పవర్. కామ్) సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ – మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ తీర ప్రాంత రక్షణ గోడ రూ.323 కోట్లతో నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్), ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీరం కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. నవంబర్ నుంచి పనులు ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.