Skip to main content

Telugu News Power

రాయలు,రంగా విగ్రహాలు ఆవిష్కరించిన మంత్రి కందుల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి.

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల, కొత్తపల్లి

పెరవలి: ఆగస్టు,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా విగ్రహాలను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారితో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శాంతికి ప్రతీకగా కపోతాలను ఎగురవేసి, గ్రామంలోని వృద్ధులు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రజలు, ప్రయాణికులు సేదతీరేలా అద్భుతమైన మండపాన్ని ఏర్పాటు చేసి, మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించిన గ్రామ పెద్దలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటి, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా తెలుగు జాతి గర్వించేలా చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన చరిత్ర, సంస్కృతి, తెలుగు భాష పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు.
కులమతాలకు అతీతంగా పేదల పక్షాన నిలిచిన వంగవీటి మోహన రంగా గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా మనకు దూరమై దశాబ్దాలు గడిచినా, నేటికీ యువత ఆయనను స్మరించుకుంటోందంటే ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు అదే నిదర్శనం. రంగా గారి ఆశయాల సాధనకు నా వంతు కృషి చేస్తానన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాయకత్వంలో, ఉపముఖ్యమంతి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదరిస్తున్న నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం ప్రజాసేవకుడిగా రుణపడి ఉంటానని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్, కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు.