Skip to main content

Telugu News Power

‘ఇక్కడ ఓట్లు కాదు.. పడవలు కావాలి’: కొత్త పార్లమెంట్ భవనంపై ఎంపీ రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చెస్తున్న రేణుక

న్యూఢిల్లీ: ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షపు నీటితో నిండిపోయిన రహదారులు, పార్లమెంట్ భవన ప్రాంగణానికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
​కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంపై ఆమె స్పందిస్తూ.. “న్యూ ఇండియా కొత్త పార్లమెంట్ సరికొత్తగా ఉంది. ఇక్కడ సభకు రావడానికి ఓట్లు కాదు, పడవలు కావాలి” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, ముందస్తు వర్షపాతం పట్ల అధికారులకు ఎలాంటి సన్నాహాలు లేవో ఈ పరిస్థితి నిరూపిస్తోందని ఆమె విమర్శించారు.
​ఈ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడమే కాకుండా, రాకపోకలు స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేణుకా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ మేనేజ్‌మెంట్, వర్షాకాల సన్నాహాలపై కాంగ్రెస్, అధికార పక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీశాయి.