Skip to main content

Telugu News Power

ఆంధ్రభోజునికి ఆత్మీయ పట్టాభిషేకం, అభినవ ఆంధ్రభోజునికి నీరాజనం.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల పాలన ఏడు ప్రాకారాల్లో సాగిందని ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల అధ్యక్షులు, బుద్ధాల వెంకట రామారావు వెల్లడించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, శుక్రవారం రాత్రి, స్థానిక త్సవటపల్లి సత్యవతి లయన్స్ కమ్యూనిటీ హాల్ లో శ్రీకృష్ణదేవరాయల 518వ ఆత్మీయ పట్టాభిషేక కార్యక్రమం, దివిసీమ గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు సంయుక్తంగా, ఘనంగా నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి, యర్రంశెట్టి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. మండలి వెంకటకృష్ణారావు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు కూటమి ప్రభుత్వానికి వెంకటరత్నం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, బుద్ధాల మాట్లాడుతూ రాయలవారు మూడు ప్రాంగణాలు వ్యవసాయానికి కేటాయించారని తెలిపారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను కొనియాడి, తన మాతృభాష కానప్పటికీ తెలుగులో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించి తెలుగువారి సాహిత్య సంపదను సుసంపన్న చేశారని పేర్కొన్నారు. రాయల కాలం లో ప్రజలు సుఖసంతోషాలతో, సాహితీ వైభవంతో స్వర్ణ యుగాన్ని అనుభవించారని తెలిపారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన తెనాలి రామకృష్ణుడు, రాయలవారిచే శిక్ష పడి కళ్ళు పోగొట్టుకున్నట్టు చెప్పే విషయంలో వాస్తవం లేదన్నారు. తెనాలి రామకృష్ణుడు తిరుపతి ప్రాంతంలో చివరి రోజుల్లో నివసించినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. మండలి వెంకట కృష్ణారావు అతిపిన్న వయసులోనే 15 వేల ఎకరాల సొంత భూమిని పేదలకు దానం చేసిన మహాదాతని పేర్కొన్నారు. కళారంజని నాటక పరిషత్, భీమవరం, అధ్యక్షులు జవ్వాది దాశరధి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు కళల పట్ల, సంస్కృతీసాంప్రదాయ సారస్వతాల పట్ల అత్యంత ముక్కు చూపిన మహనీయుడని ప్రశంసించారు. మండలి వెంకటకృష్ణారావు మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి, హైదరాబాదులో జరిపిన ఊరేగింపు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది అన్నారు.తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ, నాడు మండలి వెంకటకృష్ణారావు తెలుగువారికి ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా విశ్వవ్యాప్తమైన ప్రఖ్యాతిని తీసుకువచ్చారని, ఆ వారసత్వాన్ని వారి తనయులు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కొనసాగించటం ముదావహం అన్నారు. అల్లూరి సంస్కృతి కేంద్రం కోశాధికారి బాబు శ్రీ మాట్లాడుతూ, రాయలవారి వంశీకులతో తమ రాజవంశీకులు వియ్యం అందుకున్నారని వెల్లడించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అల్లూరి సత్యనారాయణ రాజు గృహానికి, నాటి మంత్రి మండలి వెంకటకృష్ణారావు విచ్చేసి వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ కు మండలి వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలను తెలిపారు. ఈ సందర్భంగా ఈ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన చాంబర్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, పద్యగంధర్వులు చేగొండి వివి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పాలకొల్లు అత్తిలి తదితర చోట్ల అప్పటి విద్యాశాఖ మాత్యులు, మండలి వెంకటకృష్ణారావు అనుమతితో కాలేజీలు ఏర్పాటు అయిన విషయాన్ని, అందుకు ప్రయత్నించిన చేగొండి హరి రామ జోగయ్య కృషిని వివరించారు.
సాంస్కృతిక విజ్ఞాన సమితి గౌరవ అధ్యక్షులు, యునైటెడ్ కాపు క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సమాజ సేవకులకు సత్కారం జరిగింది. రసధుని అధ్యక్షులు, ప్రముఖ ఆడిటర్ పెద్దిభోట్ల లక్ష్మీనారాయణ సాహిత్య రంగానికి చేస్తున్న కృషికి, విశ్వ మానవ వేదిక ద్వారా మల్లుల సురేష్ , అన్నార్తులను ఆదుకోవటానికి చేస్తున్న, అనితర సాధ్యమైన మహా యజ్ఞం విజయవంతం కావటానికి వెనక నుండి నడిపిస్తున్న భాగస్వామి డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వరి సురేష్ కు, పాలకొల్లుకు పెద్దన్నగా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావుకు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, సేవ్ టెంపుల్స్ ఉద్యమ భాగస్వామి, మాజీ కౌన్సిలర్ మేడికొండ శ్రీనివాస్ చౌదరికి, అల్లూరి సాంస్కృతిక కేంద్రం ద్వారా, గాంధీజీ ఆశయాలకు, తెలుగు సాహిత్య పరిరక్షణకు చేస్తున్న సేవలకు గాను, పెనుమత్స సత్యనారాయణ రాజు(బాబు శ్రీ), అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ వేదిక ద్వారా కృషి చేస్తున్న కవి కోలాటి చిన పెద్దిరాజుకు, వాకర్స్ క్లబ్ ద్వారా ఎందరికో విద్య, వైద్య సహాయం అందజేస్తున్న తటవర్తి సుధాకరరావుకు ఘన సత్కారం చేశారు. ఈ సభకు సాంస్కృతిక విజ్ఞాన వేదిక కార్యదర్శి, విజయా ల్యాబ్స్ అధినేత, కొమ్ముల మురళీకృష్ణ స్వాగతం పలికారు. కానూరి ప్రభాకర్ రావు (జీ బాబు), కటారి నాగేంద్ర కుమార్, పశ్యాపుల రవికుమార్, గణేష్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. గురుదేవులు శర్మ, తమ విద్యార్థుల భువన విజయంతో రాయలవారి కాలాన్ని కళ్ళకు కట్టారు. ప్రసాద్, పాలేశ్వరి కూచిపూడి నృత్యం, చైతన్య ప్రసాద్ అభ్యుదయ గీతాలాపనా సభకు వన్నె తెచ్చాయి. ఈ కార్యక్రమంలో, సంగినీడి వెంకట రంగారావు, ముచ్చర్ల శ్రీరాం సాయి కుమార్, జక్కంపూడి మదన్మోహన్, న్యూ లైఫ్ అధినేత, అడ్డాల వాసుదేవరావు, న్యాయవాది, దాత విటాకుల వెంకటరమణ, కామిశెట్టి అయ్యప్ప నాయుడు, చిన్నమిల్లి శ్రీనివాస్ పాట పళ్ళ నాగ దుర్గ వర ప్రసాద్, గంటా కళ్యాణి నాయుడు, డాక్టర్ ప్రతాప్ రాజు, సిపిఐ నాయకులు నెక్కంటి సుబ్బారావు బృందం పలువురు పట్టణ ప్రముఖులు సాహితీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.