Telugu News Power

ఆడపిల్లే కదా అనుకోవద్దు, అవకాశం ఇస్తే వారికి ఆకాశమే హద్దు. -తల్లులకు మంత్రి నిమ్మల హితవు.

విద్యార్థినికి ఉచిత సైకిల్ అందజేస్తున్న మంత్రి నిమ్మల, సీసీఎల్ జిఎం బలరాం తదితరులు
ఉచిత సైకిళ్ల పంపిణీ సభలో మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆడపిల్లే కదా అని బాలికలపట్ల వివక్ష చూపరాదని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తల్లులకు హితవు పలికారు. పూలపల్లి, ఆగర్రు, వెలివిలి గ్రామాల 8,9, 10 తరగతుల విద్యార్థులకు స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీఎల్ ఇండియా లిమిటెడ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ నిధులతో ఆదివారం జరిగిన ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలికల చదువు పట్ల ఇప్పటికే అవగాహన వచ్చిందని, ఇంకా పెరగవలసిన అవసరం ఉందన్నారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన వారు ఆడపిల్లలేని వివరించారు. అది కూడా పాలకొల్లు
నియోజకవర్గంలోనేనని, మన కళ్ళ ముందు కనపడుతుందన్నారు. మనిషి జీవన ప్రమాణం పెరగడానికి చదువు ఒక్కటే సాధనమని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదని ప్రభుత్వం ద్వారా పేద విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా తనచే రాష్ట్రంలోనే వినూత్నంగా ఉచిత సైకిళ్ల పంపిణీ పథక రచన జరిగిందన్నారు. ఇందుకు, కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్ ఇచ్చిన ప్రోత్సాహం, సహాయం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంటినెంటల్ కాఫీ జనరల్ మేనేజర్ బలరాం మాట్లాడుతూ, తమ కంపెనీ అధినేత చల్ల రాజేంద్రప్రసాద్, 75 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారని, అది కూడా నిమ్మల రామానాయుడుతోనని చమత్కరించారు. ప్రేమించటం సులువని, ప్రేమించబడటం ఆ వ్యక్తుల కష్టపడే తత్వం, నమ్మకం పై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ విధంగా పనిచేసే వ్యక్తి రామానాయుడు అని తెలిపారు. కాఫీ టీలు చేసే కంపెనీలు బహుళ జాతి సంస్థలు మాత్రమే ఉంటాయని, అందుకు భిన్నంగా ఒక భారతీయుడు, అందులోనూ, మన తెలుగువాడు కాంటినెంటల్ కాఫీ సంస్థ స్థాపించి 32 ఏళ్లుగా ఈ వ్యాపారంలో జైత్రయాత్ర సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ కంపెనీ 10 వేల కోట్లతో, 130 దేశాలకు కాంటినెంటల్ కాఫీ రుచి చూపిస్తున్నదన్నారు. శ్రీరామరాయుడు కృషికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంచాలకులు వీ జోషి మాట్లాడుతూ, ప్రపంచమంతా మహిళా విద్య పట్ల ముక్కు చూపుతున్నదని, ఆడపిల్లలను ఎంత చదివిస్తే అంత మంచిదని, తల్లులను కోరారు.ఈ కార్యక్రమంలో, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పితల శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎంఈఓ లు గంగాధర్ శర్మ,వీరస్వామి, ఇది పాఠశాలల బోధన సిబ్బంది పాల్గొన్నారు.