న్యూఢిల్లీ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాల్)
ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ సేవల నుంచి తొలగించారు. అత్యంత పిన్నవయస్కురాలుగా ఐఏఎస్ లో గుర్తింపు పొందారు.
ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేంద్రం కఠిన చర్య
పద్మ జైస్వాల్ అనే ఐఏఎస్ అధికారిణిని కేంద్ర ప్రభుత్వం సేవల నుంచి తొలగించింది. 2003 బ్యాచ్‌కు చెందిన ఆమె, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
2007-08 కాలంలో ప్రభుత్వ నిధులను మళ్లించడం, ప్రజా ధనాన్ని అక్రమంగా వినియోగించడం వంటి అభియోగాలతో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై దీర్ఘకాలంగా విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కేంద్ర విజిలెన్స్ కమిషన్,యూపీఎస్సీ,అభిప్రాయాలు తీసుకోగా, ఆమెను సేవల నుంచి తొలగించాలని యూపీఎస్సీ సిఫారసు చేసింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేడర్ అధికారుల నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డి ఓ పి టి) సిఫారసుపై భారత రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదివరకు 2008లో పద్మ జైస్వాల్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినప్పటికీ, తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, క్రమశిక్షణా విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ చర్యను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఒక దశలో రద్దు చేసినప్పటికీ, 2026 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో విచారణ మళ్లీ అమల్లోకి వచ్చింది.
సేవల నుంచి తొలగింపు అనేది ఐఏఎస్ అధికారిపై అరుదుగా విధించే ప్రధాన శిక్షగా భావిస్తున్నారు. అయితే, ఈ చర్యతో ఆమె ప్రస్తుత ఐఏఎస్ హోదా మాత్రమే రద్దు అవుతుంది గానీ, భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తిగా అనర్హురాలు అవుతారని మాత్రం చెప్పలేం.
ఉద్యోగం పోగొట్టుకున్న పద్మ జైస్వాల్, ఐఏఎస్.
పద్మ జైస్వాల్