Skip to main content

Telugu News Power

ఏరియా ఆసుపత్రికి సుస్తి, కొత్త భవనంలోకి తరలించి రోగులను కాపాడాలి. -సిపిఎం పార్టీ డిమాండ్.

ఈ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన సిపిఎం పార్టీ బృందం

పాలకొల్లు:సెప్టెంబర్,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులు పట్ల సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు ఏ రవి బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జ్, ఏ శ్యామల రాణి, బాసిన శ్యామల, చల్లా సోమేశ్వరరావు, ఎస్ పురుషోత్తం, బి శ్యామల బృందం శనివారం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా, వారు ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం పెచ్చులు ఊడుతున్న పరిస్థితిని గమనించారు. ఆసుపత్రిలో ఉంటున్న రోగులు, పెచ్చులు పడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని క్షణక్షణం భయాందోళనలతో గడుపుతున్నారని తెలిపారు. వైరింగ్ పాతబడి విద్యుత్ సరఫరా సరిగా లేక లైట్లు, ఫ్యాన్లు పనిచేయటం లేదని ఆరోపించారు. రాత్రి పూట దోమలు దాడి తట్టుకోలేక పోతున్నామని పెషేంట్లు వాపోయారని వివరించారు. పారిశుధ్య పరిస్థితులు కూడా అధ్వానంగా ఉన్నాయని, మరుగుదొడ్లు శుభ్రం చేసిన దాఖలాలు కనిపించలేదని విమర్శించారు. పొంచి ఉన్న ఈ ప్రమాదాల నుంచి రోగులను కాపాడడానికి ముందస్తు చర్యగా తక్షణమే రోగులను కొత్త భవనంలోకి తరలించాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రోగులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.