Skip to main content

Telugu News Power

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు
కళాప్రదర్శనలో కొలువుదీరిన కళాకృతులు వీక్షిస్తున్న పవన్ దంపతులు

రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు
ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
5 వేలమంది హస్తకళాకారులకు తీరనున్న ముడి సరుకు సమస్యరాజమహేంద్రవరం: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్)మన సాంస్కృతిక వారసత్వ సంపదగా హస్తకళల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శనివారం ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును శాసన మండలి సభ్యులు, స్థానిక శాసన సభ్యులు, అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.
ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట్రవ్యాప్తంగా 5వేల హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకు అయిన కలప కొరత నుంచి విముక్తి కలుగుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలపను కళాకారుల కోసం అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మాధవమాల, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల కళాకారుల కోసం ఆయా ప్రాంతాల్లో వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా, సతీమణి అన్నా కొణిదెలతో కలిసి వుడ్ బ్యాంకులో సిద్ధంగా ఉంచిన కలప, క్లస్టర్లవారీగా కళాకారులు తయారు చేసిన కళాకృతులను తిలకించారు. పవన్‌ కళ్యాణ్‌ చొరవతో ప్రతి బొమ్మపైనా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, కళాకారుడి వివరాలు, తయారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి స్టాల్‌ వద్ద కళాకారులతో ముచ్చటించి, బొమ్మల తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు. కళాకారుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.
వుడ్ బ్యాంకులో నిల్వ ఉంచిన కలప దుంగలపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఆ దుంగను ఎక్కడి నుంచి సేకరించారు, ఆ చెట్టు వయస్సు, శాస్త్రీయ నామం తదితర వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మనోహరమైన కళాకృతులు చూసి ముగ్దరాలైన ఉప ముఖ్యమంత్రి సతీమణి
అన్నా కొణిదల ఆ ఆకృతులను కొనుగోలు చేసారు. ఉప ముఖ్యమంత్రితో
కలిసి కళా ప్రదర్శన తిలకించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, సోము వీర్రాజు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌, నీటిపారుదల సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జ్యోతి, కన్జర్వేటర్ ఎన్‌. నాగేశ్వరరావు, ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వుడ్ క్రాఫ్ట్ ప్రదర్శనలో కళాకృతులు కొనుగోలు చేస్తున్న ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల