Skip to main content

Telugu News Power

ఘనంగా యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం.

యుటిఎఫ్ ఆవిర్భావ సభలో పాల్గొన్న జిల్లా నాయకులు

యలమంచిలి: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం యలమంచిలి మండల శాఖ, సోమవారం ఘనంగా నిర్వహించింది. స్థానికమేడపాడు కూడలిలో యుటిఎఫ్ జండా స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని జిల్లా కార్యదర్శి, దండు పద్మావతి ఆవిష్కరించారు. పతాకాన్ని సీనియర్ నాయకులు యీడేపల్లి వీర రాఘవులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన, సభకు యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ,
1974 ఆగస్టు 10న ప్రాంతాలు యాజమాన్యాలు కేడర్లకు అతీతంగా సమైక్యత కోసం ఒక రాష్ట్రవ్యాపిత సంఘంగా, ఒక చారిత్రక అవసరంగా యుటిఎఫ్ ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం,విద్యారంగ వికాసం కోసం,అవినీతి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తూ విద్యారంగ పరిరక్షణకు విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తుందన్నారు అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా, హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా పనిచేస్తూ ఉపాధ్యాయుల ఆదరాభిమానాలు చూరగొన్నదన్నారు. అమర జీవులు చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, దాచురి రామిరెడ్డి, ఎస్ ఆర్ పోలిశెట్టి, షేక్ సాబ్జి, వలవల శ్రీరామమూర్తి, కలిదిండి రాఘవ రాజు, తదితరుల స్ఫూర్తితో నిత్య నూతనంగా చైతన్యవంతంగా సమరశీలంగా పనిచేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నదని విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేస్తున్నదని, అమానుషమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడిపిందని గుర్తు చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు, నాణ్యమైన మెటీరియల్ అందించడం, ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించడం, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కుటుంబ సంక్షేమ సంఘం పథకాన్ని నిర్వహించడం ఒక్క యూటీఎఫ్ కే ఉన్న ప్రత్యేకతలని వివరించారు. భవిష్యత్తులో జరిగే అన్ని పోరాటాలలో ఉపాధ్యాయులంతా సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు దేవ సుధాకర్, వి జగ్గారావు, మండల శాఖ గౌరవాధ్యక్షులు కుడుపూడి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పంతం రామమూర్తి నాయుడు సహాధ్యక్షులు బి శైలజ కోశాధికారి వర్ధనపు సందీప్ కుమార్ కార్యదర్శులు దొమ్మేటి చంద్రశేఖర రావు, పిండి రామచంద్రరావు, కేతా అబ్బులు, ఎం రాంబాబు, ఎం బాపిరాజు, మల్లుల శ్రీధర్, విప్పర్తి రవిచంద్ర, రామేశ్వరపు సత్యనారాయణ, కాపా శ్రీనివాస్, పిండి శ్రీనివాసరావు, టి గాంధీ ఎం శ్రీరామాంజనేయరావు, డివివి ఆదినారాయణ, పి కిషోర్, టీ నిరుపమ, వై రమేష్, ఎన్ నాగబాబు, జి రామాంజనేయులు, సోమంచి శ్రీనివాస శాస్త్రి, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.