భీమవరం: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రముఖ రంగస్థలం నటి, ముమ్మారు నంది అవార్డు గ్రహీత బొండాడ (భీమవరం) లక్ష్మి (61) తన జీవిత రంగస్థలం నుంచి ఆదివారం రాత్రి తన పాత్ర ముగించి, రంగస్థలం నుంచి కూడా నిష్క్రమించారు. ఈమె భర్త టైలరింగ్ చేస్తారు. కుమారుడు మధు డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. భీమవరానికి చెందిన లక్ష్మీ నాలుగున్నర దశాబ్దాల రంగస్థల చరిత్రలో బహుముఖ పాత్రలు పోషించి, నాటక సామ్రాజ్నిగా వెలుగొందారు. ఆమె నాటిక, నాటకం, సాంఘికం, జానపదం, పౌరాణికం వంటి అనేక రూపాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం నాయకి గా మాత్రమే కాకుండా, సహనటి పాత్రలు కూడా పోషించారు. తన నటనకు ప్రాధాన్యం ఇచ్చారు, తప్ప పాత్ర ఎలాంటిదైనా, బేషజం లేకుండా పోషించారు. ఈమె కలహకంటిక, వసంత, రాధ, మాతంగ, పాత్రలకు మారుపేరుగా మారారు. చింతామణి, బాలనాగమ్మ, అల్లూరి సీతారామరాజు, వంటి నాటకాలలో ఆమె పాత్ర మరువలేనిది.ఆమె తీరికలేని నటిగా చాలాకాలం గడిపారు. ఈమె నటిగా, మంచి మనసున్న మనిషిగా అందరి మన్ననలు పొందారు. పాలకొల్లు వారి తల్లి.. క్షమించు నాటిక గత ఏడాది నిజమాబాదులో జరిగిన నంది నాటకోత్సవాల్లో నాలుగు నంది అవార్డులు గెలుచుకున్నది. ఈనాటికలో ఆమెది ప్రధాన పాత్ర. లక్ష్మీ మరణం నాటక రంగానికి తీరని లోటు అని డాక్టర్ మహమ్మద్ రఫీ, ఆర్టీసీ రత్తయ్య, పాలకొల్లు నటీనటవర్గ సమాఖ్య, నాటక రంగ ప్రముఖులు, కళాపరిషత్ అధ్యక్షులు కెవి కృష్ణ వర్మ, మేడికొండ శ్రీనివాస్, మానాపురం సత్యనారాయణ గంటా కళ్యాణి నాయుడు, వీర పోతన, గుండా రామకృష్ణ, కొప్పినీడి పుల్లారావు, సారిక రామ చంద్రరావు తదితర పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
