
గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు
హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత
కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు
ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు
ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం
హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం
వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
స్టాల్స్ సందర్శిస్తూ, కళాకారులకు భరోసా ఇచ్చారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి ఆ గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు. విబి జీ రాం జీ పథకం కింద క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హస్తకళల పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026’ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు ఉత్పత్తి చేసిన కళా రూపాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తిలకించారు. సతీమణి అన్నా కొణిదల కోసం ఉప్పాడ జాందానీ చీరలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ ను సందర్శిస్తూ, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ కళాకారులకు తనవంతు ప్రోత్సాహం అందించారు. కళాకారులతో మమేకమవుతూ, వారి నైపుణ్యాన్ని అభినందించారు. కళాకారుల సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళాకారుల కోరిక మేరకు క్లస్టర్ల వారీగా గ్రూపు ఫోటోలు దిగారు. మన రాష్ట్రానికే సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
తోలుబొమ్మలాటలో ఆకట్టుకున్న రావణ సంహార ఘట్టం
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో మొదటి అడుగుగా కాకినాడకు చెందిన తోలుబొమ్మల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. సనాతన ధర్మ ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా రూపొందించిన రామాయణ, భారత, భాగవత కళారూపాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన రావణ సంహార ఘట్టం అందర్నీ ఆకట్టుకుంది. తరతరాలుగా తోలుబొమ్మలాటను నమ్మకుని జీవనాధారం సాగిస్తున్న తమ కుటుంబాలు, నేడు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థితికి చేరుకున్నట్టు కళాకారులు వివరించారు. తోలుబొమ్మలాట ఔన్నత్యాన్ని చాటేలా రాబోయే గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంజనేయుని పాత్రను ప్రత్యేకంగా తిలకించారు. పవన్ కళ్యాణ్ సందర్శించారు. అరటిపీచుతో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులు, ఫైల్స్ తదితర పర్యావరణహిత ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. తయారీ విధానాన్ని కళాకారులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేశారు. స్టాల్స్ సందర్శిస్తూ, సాధకబాధకాలు తెలుసుకుంటూ,
తిరుపతి వుడ్ కార్వింగ్ కళాకారులు రూపొందించిన చెక్క బొమ్మల స్టాల్ ను సందర్శించి, అద్భుత కళా ఖండాలను మలచిన కళాకారులను ప్రశంసించారు. వారి నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను కొనుగోలు చేశారు. శ్రీకాళహస్తి కలంకారి వస్త్రాల స్టాల్లో పెన్ కలంకారీ ఆర్ట్ తో రూపొందించిన వస్త్రాలు, దుప్పట్లు పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకున్నాయి. కలంకారీ చేనేత కళాకారుల కష్టం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వీడియో డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పెడన కలంకారీ స్టాల్ సందర్శనలో తమకు ప్రభుత్వం నుంచి ఇండిగో కలర్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్ల ప్రస్తావన రాగా సౌకర్యాల కల్పనకు భరోసా ఇచ్చారు. నరసాపురం లేస్ స్టాళ్లు సందర్శించిన సందర్భంలో వారికి వస్తున్న ఆరోగ్య సమస్యలను కళాకారులు ప్రస్తావించారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రివర్యులు హామీ ఇచ్చారు. క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

మన కళలకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తాం
బ్యాటరీ సహాయం లేకుండా నడిచే సైంటిఫిక్ చెక్క బొమ్మల స్టాల్ పవన్ కళ్యాణ్
ఆకర్షించింది. చెక్కతో చేసిన టెలీస్కోప్ తదితర ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. పంచాయతీల పరిధిలో ఉన్న ప్రతి స్కూల్లో ఈ సైంటిఫిక్ బొమ్మలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సవర కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్ లో సుదీర్ఘ సమయం గడిపారు. సంప్రదాయ సవర కళలో పురాణ కథలు, జాతీయ నాయకుల చిత్రాలతో కూడా రూపొందించాలని సూచన చేశారు. ఒక కళాఖండాన్ని తయారు చేసిన కళాకారుడికి గుర్తింపు దక్కే విధంగా ప్రతి ఆర్ట్ మీద ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, అందులో కళాకారుడి పేరు, అతను రూపొందించిన కళకి సంబంధించిన స్టోరీ అందులో పొందుపర్చాలని అధికారులకి సూచించారు. మన కళలకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కాలని, జపాన్ తరహాలో ఆర్టిస్టులను గౌరవించాలని సూచించారు. సవర కళాకారుల కోసం విబి జీ రాం జీ పథకం కింద ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నరసాపురం లేస్ కళాకారులు కళ్లకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అలాగే చేనేతలకు కండరాలు, ఎముకలు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కలంకారీలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ప్రతి కళాకారుడు ఏకాగ్రతతో ఆ కళను మలిచే క్రమంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. హస్త కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
అనంతరం మన హస్తకళలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను, కల్పిస్తున్న ప్రచారాన్ని తెలియబర్చే విధంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ ఆయన దృష్టిని ఆకర్షించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులను కలసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్ అందజేసిన కళారూపాలకు సంబంధించిన ఫోటోలు వివరాలతో సహా గ్యాలరీలో ప్రదర్శించారు. ఈ గ్యాలరీ ఉపముఖ్యమంత్రివర్యులను ఆకట్టుకుంది. వివిధ క్లస్టర్ల నుంచి మహోత్సవానికి వచ్చిన హస్త కళాకారులతో గ్రూపు ఫొటోలు దిగారు.హస్తకళల అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏలూరు కార్పెట్ కళాకారులు, అనంతపురం అరటి పీచు కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 30 మంది చొప్పున కళాకారులను ఎంపిక చేసి వారికి రెండు నెలల పాటు శిక్షణ అందిస్తారు.

గుంటూరు, కాకినాడల్లో పునరుద్ధరించిన లేపాక్షి షోరూంలు, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను వర్చువల్ గా ప్రారంభించారు.
లేపాక్షి ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ
హస్తకళా మహోత్సవం వేదిక నుంచి లేపాక్షి ఈ కామర్స్ యాప్ ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మన రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అవకాశాలు దక్కనున్నాయి. దీంతో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన 100 ఉద్యమ్ వర్క్ షాపులను ప్రారంభించారు. 2 వేల మంది కళాకారులను అధికారిక పారిశ్రామిక వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. అనంతరం సంప్రదాయ హస్తకళల పరిరక్షణ, ప్రచారంలో విశేష కృషి చేసిన పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, రాష్ట్ర చేనేత, హస్తకళల విభాగం సలహాదారు సుచిత్ర ఎల్లా గారు, హస్తకళల అభివృద్ది సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ , పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్పీ సిసోడియా, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఉపముఖ్యమంత్రి చేసిన బొమ్మలను చూసి ఆనంద పరవశులయ్యారు.