Telugu News Power

పంచాయతీ కార్మికుడ్ని విధుల్లోకి తీసుకోవాలి. -వర్కర్స్ యూనియన్, సిఐటియు డిమాండ్.

పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు, సిఐటియు నాయకులు

యలమంచిలి: మే, 7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నేరేడుమిల్లి పంచాయతీ లో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కృష్ణంరాజును డ్యూటీకి రావద్దని చెప్పడం అన్యాయమని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్, మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల కమిటీ ఆధ్వర్యంలో నేరేడుమిల్లి పంచాయతీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆంజనేయులు అధ్యక్షులు మానుకొండ శివరావు సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్ మాట్లాడుతూ, గత 17 ఏళ్లుగా నేరేడుమిల్లి పంచాయతీలో సేవలందిస్తున్న కృష్ణంరాజును అక్రమంగా తొలగించడం అన్యాయమన్నారు. రాజకీయ కారణాలతోనే పంచాయితీకి మండల పరిషత్ కి సంబంధంలేని వారు తొలగించమంటే,అధికారులు గుడ్డెద్దు చేలో పడ్డట్టు తొలగింపులకు పాల్పడటం సిగ్గుచేటనన్నారు. ఏ కారణం లేకుండా, కనీసం మాటమాత్రంగా చెప్పకుండా డ్యూటీకి రావద్దని పంచాయతీ కార్యదర్శి ఆదేశించడం, దానికి గ్రామ అధికార పార్టీ కార్యకర్త కారణమని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. అధికార పార్టీ కార్యకర్తలు తమ అధికారాన్ని,డబ్బును ఎర గా చూపి, పంచాయతీ కార్మికులపై కర్ర పెత్తనం చేయడం ప్రభుత్వానికే మాయని మచ్చని ఆరోపించారు. తక్షణమే పంచాయతీ కార్మికుడ్నీ విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి 10 గంటలకు వస్తానని చెప్పి,ఒంటిగంట వరకు రాకపోయేసరికి స్పెషల్ ఆఫీసర్ కి ఫోన్ చేశారు. ఫోను తీయకపోయేసరికి, మండల పరిషత్ ఆఫీస్ కి చేరుకుని పంచాయతీ కార్మికులు కార్యాలయ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, కిరణ్, శ్రీను, రమణ, రమేష్, రామకృష్ణ, మహాలక్ష్మి, సత్యనారాయణ .
సిఐటియు మండల కార్యదర్శి. డి.సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.