పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవతలు నిర్మించారని విశ్వసించే, శ్రీరాముడు ప్రతిష్టించిన క్షీరా రామలింగేశ్వరుని గాలిగోపురం చోళుల కాలంలో పునర్ నిర్మించినట్లు చెబుతారు. వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయాన్ని రానున్న పుష్కరాల్లో లక్షలాదిమంది సందర్శిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఆలయానికి నాణ్యమైన రంగులు వేయాలనే స్థానిక భక్తుల కోరిక మేరకు, ధర్మకర్తల మండలి చర్యలు చేపట్టింది.గాలి గోపురాన్ని చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, పర్యవేక్షకులు పసుపులేటి వాసు, సోమవారం పరిశీలించారు. గోపురం లోపల పగుళ్లు గమనించారు. అంతకుముందు చేసిన సిమెంటు పెచ్చులు ఉండడం గుర్తించారు. గోపురంపై పెరిగిన రావి,వివిధ రకాల మొక్కలు గోపురానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని భక్తులు వారి దృష్టికి తెచ్చారు. ధర్మకర్తల మండలి లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. పురావస్తుశాఖ వారి సూచనలతో, నిపుణుల సలహాలతో, ఆలయ గోపురం పునర్జీవనానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.
పెద గోపురం మరమ్మతులకు ప్రయత్నం.
పెద గోపురాన్ని పరిశీలిస్తున్న ధర్మకర్తలు అధికారులు