
భీమవరం: అక్టోబర్, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మున్సిపల్, పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
భీమవరం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రక్రియపై పలుసూచనలు చేశారు.
ప్రచార సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నగదు, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆస్తులపై రాతలు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం ఉందన్నారు.
ఎన్నికల ఖర్చులు నిర్దేశిత పరిమితుల్లోనే ఉండాలని తెలిపారు.ఎన్నికల విధుల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యమైన ఎన్నికల తేదీలు రాజకీయ పార్టీల వారికి వెల్లడించారు
మున్సిపల్ ఎన్నికలు
* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 19
* ఉపసంహరణ: అక్టోబర్ 21
* పోలింగ్: అక్టోబర్ 28
* ఓట్ల లెక్కింపు: అక్టోబర్ 30
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
* నామినేషన్ల చివరి తేదీ: అక్టోబర్ 23
* పోలింగ్: నవంబర్ 3
* ఓట్ల లెక్కింపు: నవంబర్ 5
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.