భీమవరం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్)
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆదేశాల మేరకు, మహిళలు, చిన్నారుల భద్రతను పోలీసులు నిరంతర ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా, జిల్లావ్యాప్తంగా నియమించబడిన ‘శక్తి టీమ్స్’ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భీమవరం వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసి బస్ స్టాండ్, పాలకోడేరు లోని జెడ్పీ హై స్కూల్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, మహిళలు, బాలికలు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు.
ప్రధానంగా పాఠశాల విద్యార్థినులకు ‘గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్’ అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా లేదా అనుమానాస్పదంగా కదిలినా వెంటనే తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, ఆత్మరక్షణ పద్ధతులపై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. నేటి డిజిటల్ యుగంలో పెరిగిన సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సోషల్ మీడియా వాడకంలో పాటించాల్సిన గోప్యతా నియమాలు, సైబర్ వేధింపుల నుంచి రక్షణ పొందే మార్గాల గురించి వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కవచంగా నిలిచే ‘శక్తి యాప్’ వినియోగం, దాని ప్రాముఖ్యతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. బాలికల రక్షణ కోసం రూపొందించిన ‘పోక్సో’ చట్టంలోని కఠిన నిబంధనల గురించి వివరిస్తూ, వారి భద్రత పట్ల సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మహిళా సంబంధిత నేరాల పట్ల ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని, బాధితుల గోప్యతను కాపాడుతూ జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఏదైనా అత్యవసర సమయంలో సహాయం కోసం డయల్ 100 / 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. భద్రత గల సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
భద్రతపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు.
భీమవరం బస్ స్టేషన్ లో మహిళలకు అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు