Skip to main content

Telugu News Power

మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా భారత్–ఉజ్బెకిస్థాన్ బంధం. మోడీకి ఘన స్వాగతం. సాంస్కృతిక, యోగా కార్యక్రమాలు.

“ఆర్డర్ అఫ్ ఓలియ్ దరాజలి డస్టలిక్"పురస్కారం అందుకున్న ప్రధాన మోడీ

తాష్కెంట్, ఆగస్టు 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనతో భారత్–ఉజ్బెకిస్థాన్ సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఆగస్టు 29–30 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇకపై “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.
వాణిజ్యం, పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
భారత్–ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగనున్నాయి.
ఎలక్ట్రికల్ వస్తువులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ తదితర రంగాల్లో భారత, ఉజ్బెక్ కంపెనీల మధ్య సహకారాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాణిజ్యానికి అడ్డుగా ఉన్న నాన్-టారిఫ్ అవరోధాలను తొలగించేందుకు ప్రత్యేక సంయుక్త వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
యురేనియం సరఫరాలో కీలక ఒప్పందం:
అణుశక్తి రంగంలోనూ ఇరు దేశాలు సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి. భారతదేశానికి ఉజ్బెకిస్థాన్ నుంచి దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసే విధానంపై అవగాహనకు వచ్చారు. ఇంధన భద్రతకు ఇది కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు.
రక్షణ, భద్రతకు ప్రాధాన్యం
ఉగ్రవాదం, సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రక్షణ రంగంలో సంయుక్త కార్యకలాపాలు, శిక్షణ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమలో కొత్త అవకాశాలను అన్వేషించనున్నాయి.
2026 ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన “డస్టలిక్ ” భారత్–ఉజ్బెకిస్థాన్ సంయుక్త సైనిక విన్యాసం విజయవంతం కావడాన్ని ఇరు దేశాల నేతలు ప్రశంసించారు.
డిజిటల్, ఏఐ, అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యం
డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష పరిశోధన వంటి ఆధునిక రంగాల్లో సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. తాష్కెంట్‌లో 2019లో భారత నమూనాతో ఏర్పాటైన ఐటీ పార్క్ విజయవంతంగా పనిచేస్తుండటాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి.
సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిలో పరస్పరం అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించారు. అంతరిక్ష రంగంలో శాస్త్రీయ సమాచార మార్పిడి, శిక్షణ, సంయుక్త వర్క్‌షాప్‌లకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వైద్యం, ఫార్మా రంగాల్లో కొత్త అవకాశాలు
వైద్య, ఫార్మాస్యూటికల్ రంగాల్లో భారత్–ఉజ్బెకిస్థాన్ సహకారానికి మంచి అవకాశాలు ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో భారత కంపెనీల భాగస్వామ్యంతో కొత్త వైద్య కేంద్రాలు, ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలు, ఔషధ తయారీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించనున్నారు.
అరల్ సముద్ర ప్రాంత పునరుద్ధరణకు భారత్ సాయం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌లోని అరల్ సముద్ర ప్రాంత పచ్చదనం, పర్యావరణ పునరుద్ధరణకు భారత్ సహకరించనుంది. ఇందుకోసం 10 లక్షల అమెరికన్ డాలర్ల గ్రాంట్‌తో పాటు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించనున్నట్లు భారత్ ప్రకటించింది.
మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారం “ఆర్డర్ అఫ్ ఓలియ్ దరాజలి డస్టలిక్” ను అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రదానం చేశారు. భారత్–ఉజ్బెకిస్థాన్ సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు.
చారిత్రక బంధానికి మరింత బలం
భారత్–ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. 2026–2030 కాలానికి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాన్ని కూడా స్వాగతించారు. యోగా, విద్య, క్రీడలు, పర్యాటకం, వారసత్వ కట్టడాల పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచనున్నారు.
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు ఉజ్బెకిస్థాన్ మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల అవసరాన్ని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ అభ్యర్థిత్వానికి ఉజ్బెకిస్థాన్ తన మద్దతును పునరుద్ఘాటించింది.
మొత్తంగా ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనతో భారత్–మధ్య ఆసియా సంబంధాలకు కొత్త ఊపునిచ్చినట్లయింది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, వైద్యం, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో విస్తృత సహకారానికి ఈ పర్యటన బలమైన పునాది వేసింది.
మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనతో భారత్‌కు భారీ డిప్లమాటిక్ విజయం చేకూరింది. అత్యున్నత పురస్కారం, యురేనియం ఒప్పందం, 5 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం!” వీటిలో ఉన్నాయి. ఈ పర్యటనలో మోడీ కి ఘన స్వాగతం లభించింది. భారతీయులు తమ సంతానంతో తరలి వచ్చి ఆత్మీయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రధాన మోడీ పాల్గొన్నారు. యోగా కార్యక్రమంలో విదేశీయాలతో కలిసి యోగ చేశారు. తరాలుగా రష్యా భారతదేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలకు మరోసారి మోడీ కృషి చేశారు.