పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పేపర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పూలపల్లి వై జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలో రైతులు పండించిన రొయ్యలు రోడ్డుపై పారబోసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల నడ్డి విరుస్తున్న సిండికేట్ల భాగోతంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా, విజ్ఞప్తి చేస్తూ, నాణ్యమైన సీడ్ అందించే ఏర్పాటు చేయాలని కోరారు. మేత ధరలు ఇష్టానుసారం పెంచకుండా నియంత్రణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రొయ్యల దిగుబడి వచ్చే సమయానికి రొయ్య ధర తగ్గించకుండా, కనీస మద్దతు ధర రొయ్యల రైతులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలేవి ఇంతవరకు అమల్లోకి రాలేదన్నారు. మేత ధరల పెంపు తాత్కాలికంగా మాత్రమే నిలుపుదల చేశారని వెల్లడించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, క్రాప్ హాలిడే ప్రకటించవలసి వస్తుందని హెచ్చరించారు. ఇందువల్ల రైతులకు చెరువులు బాగుపడి దిగుబడి పెరుగుతుందన్నారు, కొనేవారు లేక మేత ధరలు దిగి వస్తాయన్నారు. సరుకు దొరక్క రొయ్యల ధర పెరుగుతుందన్నారు. రొయ్యల రైతుల కష్టంతో కంపెనీలు వేల కోట్లు సంపాదించుకున్నాయని, రైతులు పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోనం చినబాబు మాట్లాడుతూ, ఆక్వా రంగం కొందరు వ్యక్తుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందని, ప్రభుత్వం ఏమీ చేయలేక తన నిస్సహాయత వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. రైతు పెట్టుబడికి, వచ్చే ఆదాయానికి కిలోకు రూ.40 లు నష్టం వస్తుందని, ఈ నష్టాన్ని రైతులు ఎన్నాళ్లు భరించాలని ప్రశ్నించారు. రైతు ఇంటి శ్రీరాముడు మాట్లాడుతూ ఆక్వారంగానికి కూడా కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాలకొల్లు నర్సాపురం ఆచంట నియోజకవర్గం రైతులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల ట్రాఫిక్ బంద్ అయ్యి, భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో, సంఘ ఉపాధ్యక్షులు పెనుమత్స వెంకట సత్యనారాయణ రాజు, భూపతి రాజు వెంకట శ్రీనివాసరాజు, కార్యదర్శులు జాన్ డేవిడ్ రాజు, గొప్పన హరికిషోర్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, వివి సోమరాజు, గుంటూరు చంటి రాజు, మేక ఫణీంద్ర ప్రసాద్, కోశాధికారి దాట్ల సోమేశ్వర రాజు, పోలవరం సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రొయ్యల రైతుల నిరసన ప్రదర్శన